
సిగాచి పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ సిన్హా అరెస్ట్
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. సిగాచి ఇండస్ట్రీస్ ఫార్మా ప్లాంట్‌లో సంభవించిన భారీ పేలుడు కేసులో ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ఉన్నతాధికారులు ఆదివారం ధృవీకరించారు.
సిగాచి ఇండస్ట్రీస్ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను ఈ కేసులో నిందితుడు రెండో నిందితుడుగా పేర్కొంటూ శనివారం అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ప్రమాదానికి సంబంధించి మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేయగా, వీరంతా ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందినవారేనని పోలీసులు వెల్లడించారు.
జూన్ 30న సంగారెడ్డి జిల్లా ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించి, ఆ తర్వాత చెలరేగిన అగ్నిప్రమాదంలో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపగా, భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై విచారణ కొనసాగుతోంది.
