
సిక్కు సంప్రదాయాన్ని కాపాడాలి: సీఎం యోగి ఆదిత్యనాథ్
గతంలో ఆధ్యాత్మిక పురుషులు చెప్పిన ప్రకారం నడుచుకోవడం వల్లే నేడు భారతదేశం సురక్షితంగా ఉందని సీఎం యోగి అన్నారు.గురువుల బోధనలను ఆచరణలో పెట్టి, సిక్కు సంప్రదాయాన్ని కాపాడాలని గురునానక్ జయంతి సందర్బంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సిక్కు సమాజాన్ని ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ లక్నోతో పాటు లఖింపూర్ ఖేరీ, పిలిభిత్, రాంపూర్, షాజహాన్‌పూర్, ఉదమ్‌సింగ్ నగర్ వంటి ప్రాంతాల్లో సిక్కు సోదరులు వెళ్లి అక్కడి లోపాలను గుర్తించి, సమాజానికి ఉపయోగపడే విధంగా సంస్థలను బలపరచాలి. గురువుల ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే సంస్థలు బలంగా ఉండాలి అని సూచించారు. పేదలకు అన్నదానం, అందరితో కలిసిమెలిసి ఉండండని చెప్పారు. అలాంటి సంఘటనలు గురుద్వారాల్లో కనబడుతోంది.
పంజాబ్‌లో మతమార్పిడి ఆందోళనకరం
గురునానక్ దేవ్ జీ కుల వివక్షను తుడిచిపెట్టారు, సామాజిక ఏకతకు మార్గం చూపారు. కానీ, ఇప్పుడు పంజాబ్ తేరాయి ప్రాంతాల్లో కొందరు సిక్కులు ఇతర మతాలకు మారుతున్నారని వింటున్నాను. ఇది చాలా బాధాకరం. గతంలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. ఈ చెడు ధోరణిని కఠినంగా అరికట్టాలి అని యోగి అన్నారు. అంతేకాదు మనం అంతర్గత బలహీనతలు సృష్టించినప్పుడు మాత్రమే. విదేశీ దండయాత్రలు మన దేశంలోకి చొరబడేదని గుర్తు చేశారు. మనలో ఐక్యత ఉండాలి, గురువుల బోధనలను పాటించాలి అని పిలుపునిచ్చారు.
పేదలకు ఇళ్లు పంపిణీ
గురునానక్ జయంతి సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ లక్నోలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ హౌసింగ్ యోజన కింద నిర్మించిన 72 ఫ్లాట్లను ప్రారంభించారు. ఈ ఇళ్లు మాఫియా కబ్జా నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్న భూములపై నిర్మించారు. వీటిని తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు కేటాయించనున్నారు.
గురునానక్ జయంతి లేదా గురుపురబ్ సిక్కు మత పితామహుడు గురునానక్ దేవ్ జీ జన్మదినోత్సవం. ఇది ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా సిక్కు భక్తులు ప్రార్థనలు, కీర్తనలు, లంగర్ సేవలు నిర్వహించి గురువుల బోధనలను స్మరించుకుంటారు.
