Let's talk: editor@tmv.in
సిక్కు అల్లర్ల కేసులో ప్రాసిక్యూషన్ లిఖిత పూర్వక వివరాలు ఇవ్వాలి:అవెన్యూ రౌస్ కోర్టు

సిక్కు అల్లర్ల కేసులో ప్రాసిక్యూషన్ లిఖిత పూర్వక వివరాలు ఇవ్వాలి:అవెన్యూ రౌస్ కోర్టు

Pinjari Chand
30 అక్టోబర్, 2025

సంచలనం సృష్టించిన ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత దేశవ్యాప్తంగా 1984లో చెలరేగిన సిక్కు అల్లర్లలో సుమారు 3 వేల మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. ఇందులో అప్పట్లో ఢిల్లిలో ఎంపీగా ఉన్న మాజీ ఎంపీ సజ్జన్ కుమార్​ ఆందోళనకారులను ప్రేరేపించారని, సిక్కులపై దాడులకు ఉసిగోల్పారని 2000 సంవత్సరంలో కేసు నమోదైంది. సరైన ఆధారాలు లేవని కేసు ముందుకు సాగలేదు.అయితే 2015 లో సీబీఐ కేసును మళ్లీ ఓపెన్ చేసింది. అయితే ఈ కేసులో తాజాగా ప్రాసిక్యూషన్ రాతపూర్వక వాదనలు సమర్పించాలంటూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది.

ఈ కేసు జనక్‌పురి, వికాస్‌పురి పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించినది. 1984 నవంబర్ 1న జనక్‌పురిలో సిక్కులైన సోహన్ సింగ్, అతని అల్లుడు అవ్తార్ సింగ్‌ హత్యకు సంబంధించినది. వికాస్‌పురి కేసు మాత్రం గురుచరణ్ సింగ్‌ను సజీవదహనం చేసిన ఘటనకు సంబంధించినది.

గత సంవత్సరం 2023 ఆగస్టు 23న కోర్టు సజ్జన్ కుమార్‌పై హత్య (సెక్షన్ 302 IPC) ఆరోపణ నుంచి విముక్తి ఇచ్చినా, దాడులు, అల్లర్లు, మత విద్వేషం అల్లరి మూకలను ప్రేరేపించడం, దోపిడీ, ఇళ్లపై దాడి, హత్యాయత్నం వంటి పలు నేరాల కింద ఛార్జీషీట్ నమోదు చేసింది.

కోర్టు వివరాల ప్రకారం

1984 నవంబర్ 1న గులాబ్ బాగ్, నవాడా ప్రాంతంలో వందలమంది వ్యక్తులు కర్రలు, ఇనుపరాడ్లు, ఇటుకలతో గుంపుగా చేరి గురుద్వారాను దగ్ధం చేయడం, సిక్కుల ఇళ్ళను దోచుకోవడం, కాల్చివేశారు. సజ్జన్ కుమార్ ఆ గుంపులో ఉన్నారని మౌఖిక, లిఖిత సాక్ష్యాలు తెలుపుతున్నాయని పేర్కొంది. అయితే నవంబర్ 2న జరిగిన సోహన్ సింగ్, అవ్తార్ సింగ్ హత్యలకు సంబంధించి మాత్రం కోర్టు హత్య (302), హానికలిగించడం (325) సెక్షన్ల నుంచి ఆయనను మినహాయించింది.

స్పెషల్ జడ్జి దిగ్ వినయ్ సింగ్ ఈ కేసును నవంబర్ 27, డిసెంబర్ 4 తేదీలకు వాదనలు కోసం వాయిదా వేశారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మనీష్ రావత్, సజ్జన్ కుమార్ తరఫున అనిల్ కుమార్ శర్మ, అపూర్వ్ శర్మ, ఎస్.ఎ. హష్మీ, బాధితుల తరఫున సుర్ప్రీత్ కౌర్ హాజరయ్యారు.