Let's talk: editor@tmv.in
సిక్కింలో భూటాన్ వాణిజ్య బృందం పర్యటన: ప్రాంతీయ సహకారంపై కీలక చర్చలు

సిక్కింలో భూటాన్ వాణిజ్య బృందం పర్యటన: ప్రాంతీయ సహకారంపై కీలక చర్చలు

Dantu Vijaya Lakshmi Prasanna
6 ఫిబ్రవరి, 2026

భూటాన్, సిక్కిం మధ్య ప్రాంతీయ వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసే దిశగా ఒక కీలక అడుగు పడింది. భూటాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి చెందిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం బుధవారం సిక్కింలో పర్యటించి, పరస్పర ఆర్థిక సహకారం, జ్ఞాన మార్పిడిపై సుదీర్ఘ చర్చలు జరిపింది. భూటాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు తాండి వాంగ్‌చుక్ నాయకత్వంలోని ఈ బృందం, సిక్కిం వాణిజ్య పరిశ్రమల శాఖ కార్యదర్శి కర్మ డి. యూత్సోతో పాటు ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యింది. ఇరు ప్రాంతాల మధ్య సరిహద్దు వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, అలాగే పారిశ్రామికాభివృద్ధికి కొత్త మార్గాలను అన్వేషించడం ఈ చర్చల ప్రధాన ఉద్దేశ్యం.

ఈ సమావేశంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులకు అనువైన ప్రాధాన్యత రంగాలు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇరు ప్రాంతాల మధ్య మెరుగైన మార్కెట్ అనుసంధానాన్ని ఏర్పరచడం ద్వారా స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావచ్చని అధికారులు భావిస్తున్నారు. అలాగే, ఉత్తమ పనితీరు పద్ధతులను ఒకరితో ఒకరు పంచుకోవడం ద్వారా వ్యాపార రంగంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ప్రతినిధి బృందం అభిప్రాయపడింది.

స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించాలంటే ప్రభుత్వ విధానపరమైన చర్చలు, సంస్థాగత సంబంధాలు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యం అత్యంత అవసరమని ఈ సందర్భంగా అధికారులు నొక్కి చెప్పారు. సిక్కిం, భూటాన్ మధ్య నెలకొన్న ఈ సానుకూల వాతావరణం భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులకు, ఉపాధి అవకాశాలకు బాటలు వేయనుంది. ప్రాంతీయ సమగ్రతను పెంపొందించడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందడమే లక్ష్యంగా ఈ పర్యటన విజయవంతంగా ముగిసింది.

కాగా, భూటాన్, సిక్కిం (భారతదేశం) మధ్య అధికారికంగా వాణిజ్య ఒప్పందాలు సహకారాలు కొత్తవేమీ కావు. చారిత్రక కాలం నుండి ఈ రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక వ్యాపార సంబంధాలు బలంగా ఉన్నాయి. గతంలో జరిగిన కొన్ని ముఖ్యమైన పరిణామాలుఈ రెండు ప్రాంతాల మద్య జరిగాయి.

అప్పట్లో భారతదేశం, భూటాన్ మధ్య 1972లో కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య, రవాణా ఒప్పందం సిక్కిం-భూటాన్ మధ్య వ్యాపారానికి బలమైన పునాది వేసింది. ఈ ఒప్పందం ద్వారా రెండు ప్రాంతాల మధ్య వస్తువుల రవాణాపై సుంకాలు లేకుండా ఉచిత వాణిజ్యం కొనసాగుతోంది. సిక్కిం భారత రాష్ట్రంగా అవతరించక ముందు నుండే ఈ హిమాలయ ప్రాంతాల మధ్య ఉప్పు, ఉన్ని, ఇతర నిత్యావసర వస్తువుల మార్పిడికి సంబంధించి సాంప్రదాయక ఒప్పందాలు అమలులో ఉండేవి.

సిక్కిం, భూటాన్ మధ్య ప్రధానంగా వ్యవసాయం, ఖనిజాలు, సేంద్రీయ ఉత్పత్తుల మార్పిడి జరుగుతుంది. భూటాన్ నుండి సిక్కింకు ప్రధానంగా విద్యుత్ శక్తి, సిమెంట్, డొలొమైట్, జిప్సం వంటి ఖనిజాలు, ఆపిల్స్, ఆరెంజ్ వంటి పండ్ల ఎగుమతులు జరుగుతాయి; దీనికి ప్రతిగా సిక్కిం నుండి భూటాన్‌కు ఔషధాలు, ప్యాకేజీ చేసిన ఆహార పదార్థాలు, సేంద్రీయ కూరగాయలు, ప్లాస్టిక్ వస్తువులు సరఫరా అవుతాయి. హిమాలయ ప్రాంతాలు కావడంతో ఇరువైపులా యాలకులు, అల్లం వంటి సుగంధ ద్రవ్యాల వాణిజ్యం కూడా గణనీయంగా ఉంటుంది.

మరో కీలకమైన అంశం ఏమిటంటే, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ చొరవ కింద ఉప-ప్రాంతీయ కనెక్టివిటీ కోసం గతంలో అనేక చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా సరిహద్దు రహదారుల అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదలపై సిక్కిం, భూటాన్ అధికారులు పలుమార్లు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో, సేంద్రీయ వ్యవసాయం, పర్యాటక రంగంలో పరస్పర సహకారం కోసం ఇరుపక్షాలు అనేక ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించాయి.

ఇంతకుముందు జరిగిన ఒప్పందాలు ఎక్కువగా ప్రభుత్వాల మధ్య పరిమితమయ్యేవి, కానీ ప్రస్తుత పర్యటన ద్వారా ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ఊపందుకుంది. గతంలో జరిగిన వాణిజ్య ప్రదర్శనలు, ఎక్స్‌పోలలో కుదిరిన ప్రాథమిక అవగాహనల ఆధారంగా, ఇప్పుడు నేరుగా పారిశ్రామికవేత్తల మధ్య అధికారిక సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కేవలం సరుకుల రవాణాకే కాకుండా, సూక్ష్మ, చిన్న. మధ్య తరహా పరిశ్రమల(ఎమ్ఎస్ఎమ్ఈ) రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి కూడా మార్గం సుగమం చేస్తోంది.