
సిక్కింలో ప్రతి గురువారం “సంప్రదాయ వస్త్రధారణ”
సిక్కిం ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల ఉద్యోగులతో సహా అందరూ ప్రతీ గురువారం నాడు "సంప్రదాయ వస్త్రధారణ పనిదినం" పాటించాలని ప్రకటించింది.
ప్రకటనలోని ముఖ్య వివరాలు:
• లక్ష్యం: హోమ్ డిపార్ట్‌మెంట్ సర్క్యులర్ ప్రకారం, ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఉద్యోగులలో సిక్కిం యొక్క ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపు పట్ల గర్వాన్ని పెంపొందించడం మరియు సంప్రదాయ విలువలను ప్రోత్సహించడం.
• నిబంధన: రాష్ట్రంలోని భిన్నమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని, గొప్ప వారసత్వాన్ని ప్రదర్శించే సంప్రదాయ దుస్తులను ప్రతీ గురువారం ధరించాలని అధికారులు, సిబ్బంది అందరూ దరించాలి.
• అమలు తేదీ: ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది.
ఈ చర్య సిక్కిం ప్రభుత్వం తన రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించడానికి, పరిరక్షించడానికి ప్రభుత్వ ఉద్యోగులు వారానికి ఒకసారి సంప్రదాయ దుస్తులు ధరించేలా ప్రోత్సహించడానికి తీసుకున్న ఒక గొప్ప సాంస్కృతిక ప్రచారం.
మన సంస్కృతికి మూలం మన సంప్రదాయాలే
సిక్కిం ప్రభుత్వం ప్రతీ గురువారం సంప్రదాయ దుస్తులు ధరించే విధానాన్ని ప్రకటించడం చాలా అర్థవంతమైన నిర్ణయం. ఈ విషయం యావత్ భారతానికి ఒక విలువైన సందేశం ఇస్తుంది. ఆధునిక జీవనశైలిలో మన మూలాలను, మన సంస్కృతిని మరచిపోకూడదని ఈ సందర్భం గుర్తుచేస్తుంది..
ఈ రోజుల్లో యువత పాశ్చాత్య ఫ్యాషన్, గ్లోబల్ ట్రెండ్స్ లో మునిగిపోతున్న తరుణంలో, సిక్కింలో లాంటి మార్పు మనందరికీ ఒక పాఠం. సంప్రదాయం అంటే పాతదనమని కాదు, అది మన ఆత్మగౌరవం, మన గుర్తింపుని నిలబెట్టే బలం. ఒక జాతి భాష, దుస్తులు, ఆచారాలు చిరస్థాయిగా ఉంటేనే ఆ జాతి ఉనికి ప్రపంచ పటం లో నిలుస్తుంది. ఉదాహరణకి చీర కట్టు,పంచ కట్టు తెలుగింటి సాంప్రదాయాలు ఎంతమంది ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు? పండుగకో ,పెళ్లి వేడుకలకో తప్ప మిగిలిన సందర్భాలలో యువతకు అసలు ఆ ఊసే ఉండడంలేదు. నాగరికత మార్పుకు అభివృద్ధికి మంచిదే కాని మితిమీరిన నాగరికత మన సంస్కృతి ,సంప్రదాయాలను మార్చేయలా వుండకూడదు. దీనివల్ల మనం మన ఉనికిని కోల్పోతామని ప్రతీ ఒక్కరూ భావించాలి. అప్పుడే నిజమైన మనం మన జాతీమూలాలని కాపాడుకోగలం..
మన దేశం విభిన్న సంస్కృతుల మేళవింపు. కానీ ఆ విభిన్నతలోని అందాన్ని కాపాడటానికి ఇలాంటి చిన్నచిన్న నిర్ణయాలు పెద్ద మార్పు తీసుకురాగలవు. ప్రతి గురువారం సంప్రదాయ దుస్తులు ధరించడం ఒక ఆచారం మాత్రమే కాదు. అది ఒక తరం తమ మూలాలను మళ్లీ గుర్తు చేసుకునే అవకాశం.
ఈ మార్పు నేటి యువతకు ఎంతో అవసరమైనది. ఇది మనకు చెబుతోంది. “ఆధునికతను స్వీకరించు కానీ సంస్కృతిని మరచిపోకు.”అని ..ఇలాంటి ఆలోచనలు ప్రతి రాష్ట్రంలో పుట్టి, మనందరినీ మన మూలాలకు దగ్గర చేయాలని మనమంతా ఆశించాలి.
