
సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనంపై 'లక్ష సంతకాల' సేకరణ ప్రారంభించిన కేటీఆర్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ బుధవారం లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఈ ఉద్యమానికి మద్దతుగా తొలి సంతకాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేశారు. కంటోన్మెంట్ ప్రజల ఆకాంక్షను స్పష్టంగా, బలంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు.
కంటోన్మెంట్ విలీన అంశాన్ని కొందరు రాజకీయ లాభాల కోసం డ్రామాగా మార్చి ప్రజలను గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శించింది. విలీనాన్ని కోరుతూ దీక్షలు చేపట్టిన వారు అసలు దీక్ష ఎందుకు ప్రారంభించారు? ఎందుకు మధ్యలోనే విరమించుకున్నారు? అనే విషయాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వలేదని ఆరోపించింది. విలీనం అనేది పార్టీల సమస్య కాదని, ఇది కంటోన్మెంట్ ప్రజల నిత్యజీవితానికి సంబంధించిన ప్రజా సమస్య అని పేర్కొంది.
ఇలాంటి కీలక అంశంపై పోరాటం చేయాల్సి వస్తే పార్టీలకతీతంగా అందరినీ కలుపుకొని, స్పష్టమైన రోడ్‌మ్యాప్‌తో ముందుకు సాగాలని బీఆర్ఎస్ సూచించింది. కానీ కొందరు నేతలు దిశానిర్దేశం లేకుండా వ్యవహరించడం వల్ల ప్రజల్లో అయోమయం పెరుగుతోందని వ్యాఖ్యానించింది. ముఖ్యంగా బీజేపీ నేతల నుంచి, వివిధ వేదికలపై విభిన్నమైన ప్రకటనలు రావడంతో కంటోన్మెంట్ ప్రజల్లో సందిగ్ధత మరింత ఎక్కువైందని తెలిపింది.
కంటోన్మెంట్ విలీనాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు, స్థానిక బీజేపీ మొదటి నుంచే అవలంబిస్తున్న వ్యతిరేక వైఖరిని స్పష్టం చేస్తున్నాయని బీఆర్ఎస్ పేర్కొంది. మరోవైపు, ఎనిమిది రోజుల పాటు సాగిన దీక్షకు ఒక్క కాంగ్రెస్ మంత్రి కూడా హాజరుకాకపోవడం, ఎమ్మెల్యే గణేష్ అకస్మాత్తుగా దీక్ష విరమించడం చూస్తే, అది కేవలం రాజకీయ స్టంట్ మాత్రమేనని విమర్శించింది.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ పూర్తయ్యాక, ఆ పత్రాలను కేంద్ర మంత్రి ఈటల రాజేందర్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పంపించి, కంటోన్మెంట్ ప్రజల బలమైన ఆకాంక్షను వారి దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. కంటోన్మెంట్ విలీనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ పార్టీలకు, సంఘాలకు అతీతంగా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
