
సికింద్రాబాద్‌లో ‘సర్దార్@150 యూనిటీ మార్చ్’
భారత తొలి హోంమంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండిలో భారీ ఎత్తున 'సర్దార్@150 ఏక్తా మార్చ్' జరిగింది.ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు ప్రముఖ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, యువత, మహిళలు, విద్యార్థులు సహా భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ వక్తలు భారత ఐక్యత, సమగ్రత కోసం సర్దార్ పటేల్ చేసిన త్యాగాలను యువతకు స్ఫూర్తిగా నిలిపే బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. భారత స్వాతంత్య్రం అనంతరం 540కు పైగా సంస్థానాలను ఏకం చేసి దేశాన్ని ఒకే జెండా కింద నిలబెట్టిన మహోన్నత కృషిని స్మరించుకున్నారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం పాలన నుంచి విముక్తి చేసి, తెలంగాణ నేలను త్రివర్ణ పతాకం రంగులతో నింపిన పటేల్ సేవలను తరతరాలకు అందించాలని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు మాట్లాడుతూ, భారత ఉపఖండంలోని సంస్థానాలను ఏకం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వార్షికోత్సవాలను పురస్కరించుకుని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు.ఈ జాతీయ వేడుకల్లో భాగంగా, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందె ఆధ్వర్యంలో బీజేవైఎం కార్యకర్తలు గుజరాత్‌లోని కెవాడియా గ్రామంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహమైన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంను దర్శించుకున్నారు అని పేర్కొన్నారు.
యువతలో జాతీయ భావాలను నింపడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని, భారత్‌లో హైదరాబాద్ రాష్ట్ర విలీనంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోషించిన చారిత్రక పాత్రను యువతకు తెలియజేసి, వారిలో స్ఫూర్తి నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సికింద్రాబాద్ ప్రజలు విశేషంగా స్పందించి వేడుకలను విజయవంతం చేయడంపై నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. యువత, విద్యార్థుల్లో దేశ చరిత్రపై అవగాహన పెంచి, పటేల్ చూపించిన మార్గంలో నడుస్తూ దేశ అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. సర్దార్ పటేల్ ఆత్మస్ఫూర్తిని భావి తరాలు సజీవంగా కొనసాగించాలని ఈ వేడుక సంకల్పించింది.
నిజాం పాలనపై సర్దార్ పటేల్ ఉక్కుపాదం: హైదరాబాద్ రాష్ట్ర విలీనం
స్వాతంత్య్రం అనంతరం దేశ ఐక్యతను సాధించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పట్టుదల కారణంగానే హైదరాబాద్ రాష్ట్రం 1948లో భారత యూనియన్‌లో విలీనం కాగలిగింది. 1947లో భారతదేశం స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, హైదరాబాద్ సంస్థానం విలీనం విషయంలో నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్వతంత్రంగా కొనసాగాలని ప్రయత్నించారు. రాజ్యాంగంలో విలీనానికి నిరాకరించడం, రాజకార్ల కార్యకలాపాలు రాష్ట్రంలో అలజడి రేపాయి.
దేశ భద్రతకు ముప్పుగా మారుతున్న పరిస్థితులను గమనించిన పటేల్, మొదట శాంతియుత చర్చలకు ప్రయత్నించారు. కానీ రాజకార్ల దౌర్జన్యాలు పెరగడంతో కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది. 1948 సెప్టెంబర్ 13న 'ఆపరేషన్ పోలో' పేరుతో సైనిక చర్య ప్రారంభమైంది. ఐదు రోజుల ఆపరేషన్‌లో భారత సైన్యం వేగంగా ముందుకు సాగి, సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోయారు. వెంటనే హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైంది.
ఈ సైనిక చర్య ద్వారా హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైంది. దేశంలోని 540కి పైగా సంస్థానాలను ఏకం చేసిన పటేల్, ఈ చర్యతో హైదరాబాద్‌ను నిజాం చెర నుంచి విముక్తి చేసి, తెలంగాణ నేలపై త్రివర్ణ పతాకాన్ని శాశ్వతంగా నిలబెట్టారు. ఆ విధంగా ఆయన భారత చరిత్రలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్నారు.
