
సికింద్రాబాద్‌లో ఉపాధి హామీ పేరు మార్పును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నిరసన
పార్లమెంట్‌లో ఇటీవల ఆమోదం పొందిన విక్సిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్) –వీబీ-జీ రామ్ జీ బిల్లు, 2025కు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శనివారం నిరసన వ్యక్తం చేసింది. సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు. మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసనలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు, వివేక్, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే నవీన్‌యాదవ్, వీహెచ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ బిల్లుతో దేశవ్యాప్తంగా అమలులో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను రద్దు చేసి, మహాత్మాగాంధీ పేరును తొలగించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఇది గ్రామీణ పేదల హక్కులపై నేరుగా దాడి చేయడమేనని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఉపాధిని “హక్కు”గా గుర్తించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త బిల్లు తీసుకురావడం ద్వారా ఆ హక్కును బలహీనపరుస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ అభిప్రాయం ప్రకారం, ఈ బిల్లులో ప్రతిపాదించిన 60:40 కేంద్ర, రాష్ట్ర నిధుల వాటా రాష్ట్ర ప్రభుత్వాలపై భారీ ఆర్థిక భారం మోపుతుందని, దీని వల్ల గ్రామీణ ఉపాధి అమలులో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశముందని పేర్కొన్నారు. ఇప్పటివరకు కేంద్రం ఎక్కువ భారం మోయగా, ఇప్పుడు రాష్ట్రాలపై అదనపు బాధ్యత వేయడం అన్యాయమని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
ఈ బిల్లు ఆమోదంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కూడా తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్‌లో రెండు సభల్లోనూ తీవ్ర గందరగోళం మధ్య, తగిన చర్చ లేకుండా బిల్లును హడావుడిగా ఆమోదించారని ఆయన మండిపడ్డారు. 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం తీసుకురావడానికి ముందు సంవత్సరాల పాటు చర్చలు జరగాయని, స్టాండింగ్ కమిటీ పరిశీలన జరిగినదని, అన్ని పార్టీల ఏకగ్రీవ మద్దతు లభించిందని గుర్తు చేశారు. అలాంటి చారిత్రక చట్టాన్ని ఇప్పుడు తొలగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. బిల్లు ఆమోదం అనంతరం జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ఒక కార్టూన్‌ను పంచుకున్నారు. అందులో “కొత్తదైనా అర్థంలేని సంక్షిప్త నామాల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ” అంటూ వ్యంగ్యంగాపేర్కొన్నారు. దీనికి ఆయన ప్రధాని అక్రోనిమ్ వ్యాధితో బాధపడుతున్నారు అంటూ వ్యాఖ్య జత చేశారు.
ఇదిలా ఉండగా, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్‌సభ ఆమోదం అనంతరం శుక్రవారం రాజ్యసభ కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. కొత్త బిల్లు ప్రకారం ప్రతి గ్రామీణ కుటుంబానికి 125 రోజుల వేతన ఉపాధి హామీ ఇవ్వనున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న 100 రోజుల కంటే 25 రోజులు ఎక్కువ. అయితే వ్యవసాయ విత్తనాలు, కోతకాలంలో గరిష్ఠంగా 60 రోజుల పాటు ఉపాధి పనులను రాష్ట్రాలు ముందుగానే పరిమితం చేసే వెసులుబాటు సెక్షన్ 6 ద్వారా కల్పించారు.
లోక్‌సభలో బిల్లు ఆమోద సమయంలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేయగా, ఆ గందరగోళం మధ్యే బిల్లు ఆమోదం పొందింది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చింది.
