Let's talk: editor@tmv.in
సికింద్రాబాద్‌ను ముక్కలు చేస్తే సహించం: మాజీమంత్రి తలసాని

సికింద్రాబాద్‌ను ముక్కలు చేస్తే సహించం: మాజీమంత్రి తలసాని

Gaddamidi Naveen
12 జనవరి, 2026

సికింద్రాబాద్ నియోజకవర్గ భౌగోళిక స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తే సహించేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ ప్రాంతాన్ని ముక్కలు చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపిస్తూ ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సికింద్రాబాద్ అనేది కేవలం ఒక నియోజకవర్గం మాత్రమే కాదని, అది శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రాంతమని, ఆ చరిత్రను ఎవ్వరూ మార్చలేరని స్పష్టం చేశారు.

సికింద్రాబాద్‌ కార్పొరేషన్‌ కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్‌ను ముక్కలు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు చేస్తాం. ఇది హెచ్చరిక కాదు, స్పష్టమైన సంకేతం” అంటూ ఆయన ఘాటుగా స్పందించారు. డీలిమిటేషన్ ప్రక్రియను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు.

సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్‌ను ముక్కలు చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన విమర్శించారు. ఇక్కడి చరిత్రను, సంస్కృతిని కాపాడుకోవడానికి కార్పొరేషన్ సాధించే వరకు విశ్రమించేది లేదని హెచ్చరించారు. ఈ ర్యాలీలో భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తామని, ప్రజలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు.