Let's talk: editor@tmv.in
సిఆర్పిఎఫ్ సిబ్బందికి అండగా ఉంటాం: రాహుల్ గాంధీ

సిఆర్పిఎఫ్ సిబ్బందికి అండగా ఉంటాం: రాహుల్ గాంధీ

Panthagani Anusha
10 ఏప్రిల్, 2026

.సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) సిబ్బంది పట్ల కొనసాగుతున్న వివక్షకు చరమగీతం పాడుతామని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను సవరించి, సిబ్బందికి తగిన హక్కులు, గౌరవం ఉన్నత స్థాయి నాయకత్వ అవకాశాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గురువారం కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (సిఆర్పిఎఫ్) 'వాలర్ డే' సందర్భంగా 'ఎక్స్' వేదికగా ఆయన జవాన్లకు అభినందనలు తెలుపుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశ భద్రతలో సిఆర్పిఎఫ్ పాత్ర అమూల్యమని రాహుల్ కొనియాడారు. "సరిహద్దుల్లో పహారా కాస్తూ ఉగ్రవాదం, నక్సలిజాన్ని తుదముట్టించడంలోనూ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించడంలోనూ జవాన్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే వారికి ఇచ్చే గౌరవం కేవలం మాటలకే పరిమితం కాకూడదు అది చర్యల్లో కనిపించాలి అని ఆయన పేర్కొన్నారు. ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్నప్పటికీ జవాన్లకు సమయానికి పదోన్నతులు రాకపోవడం ఉన్నత స్థాయి పదవులు బయటి వ్యక్తులకు దక్కడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

బయటి వ్యక్తుల పెత్తనం వద్దు

ప్రస్తుతం. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) లో ఉన్నత స్థాయి నాయకత్వ బాధ్యతలను ఇతర విభాగాల నుంచి వచ్చిన అధికారులతో భర్తీ చేయడం వల్ల దళాల్లోని ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతోందని రాహుల్ విమర్శించారు. సుదీర్ఘ అనుభవం వ్యూహాత్మక అవగాహన ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అధికారులకే ఆయా దళాల నాయకత్వ బాధ్యతలు అప్పగించడం జాతీయ భద్రతకు శ్రేయస్కరం. ప్రస్తుత విధానం సిబ్బంది నైతిక ధైర్యాన్ని దెబ్బతీస్తోంది. ఇది కేవలం కెరీర్ ఎదుగుదల సమస్య మాత్రమే కాదు ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం అని ఆయన వివరించారు. వేతనాలు, సంక్షేమం, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని భరోసా ఇచ్చారు.

పార్లమెంటులో ఏకపక్ష నిర్ణయాలు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన సిఆర్పిఎఫ్ ఏకీకృత చట్టం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐదు రకాల దళాలకు ఒకే చట్టం తీసుకువచ్చే క్రమంలో సిబ్బంది అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. ఈ బిల్లును లోతుగా పరిశీలించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి (జెపిసి) పంపాలన్న విపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం బేఖాతరు చేసిందని ధ్వజమెత్తారు.

లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చ జరిగే సమయంలో ప్రతిపక్ష నేతగా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని గొంతు నొక్కేశారని విమర్శించారు. రాజ్యసభలో ఆమోదం పొంది, లోక్‌సభలో వాయిస్ ఓటుతో ఆమోదించుకున్న ఈ బిల్లు జవాన్ల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే తాము అంగీకరించబోమని ఆయన పునరుద్ఘాటించారు. దేశం వీర సైనికులకు రుణపడి ఉందని వారికి న్యాయం చేసే వరకు పోరాడతామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.