
సిఆర్డిఏ ప్రాజెక్ట్ కార్యాలయానికి ఐజీబీసీ “నెట్ జీరో ఎనర్జీ – డిజైన్” సర్టిఫికెట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణహితమైన, శాశ్వత అభివృద్ధి సాధన లక్ష్యంగా ముందుకు సాగుతోంది. భారతదేశానికి ఆదర్శవంతమైన హరిత రాజధానిగా ప్రజరాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలనే దిశగా ప్రతి ప్రాజెక్టు రూపకల్పనలో సుస్థిరాభివృద్ది, హరిత భవనాల అభివృద్ధి సూత్రాలు, మెరుగైన ఇంధనాల నిర్వహణ సామర్థ్యాన్ని సిఆర్డిఏ సమగ్రంగా అమలు చేస్తోంది.
ఈ దిశగా అమరావతిలోని సిఆర్డిఏ ప్రాజెక్ట్ కార్యాలయానికి ప్రతిష్టాత్మకమైన నెట్ జీరో ఎనర్జీ (డిజైన్) సర్టిఫికెట్‌ను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) ప్రధానం చేసింది. అమరావతిలో ఈ తరహా గుర్తింపును పొందిన మొదటి భవనంగా సిఆర్డిఏ ప్రాజెక్టు కార్యాలయం నిలవడం విశేషం. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోంది.
ఈ సర్టిఫికేషన్ ద్వారా ప్రాజెక్టు కార్యాలయ భవనం తన వార్షిక విద్యుత్ అవసరాలన్నింటిని పునరుత్పాదక శక్తి వనరుల ద్వారా సమకూర్చుకునే విధంగా రూపొందించబడినట్లు గుర్తింపు లభించింది. ప్రాజెక్టు కార్యాలయం కోసం 540 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయబడుతోంది. మిగిలిన అవసరాల కోసం పునరుత్పాదక శక్తివనరుల సమర్ధవంతమైన వినియోగం ద్వారా పూర్తి స్థాయిలో “నెట్ జీరో ఎనర్జీ” స్థాయిని సిఆర్డిఏ ప్రాజెక్టు కార్యాలయం చేరుకోనుంది.
ఈ సందర్భంలో కమిషనర్ కె.కన్నబాబు మాట్లాడుతూ సిఆర్డిఏ ప్రాజెక్టు కార్యాలయం ఫ్లాగ్‌షిప్ నెట్ జీరో ప్రాజెక్ట్‌గా నిలిచిందని, పర్యావరణ పరిరక్షణ పట్ల సిఆర్డిఏ యొక్క కట్టుబాటును ఈ గుర్తింపు ప్రతిబింబిస్తుందని, భవిష్యత్ ప్రాజెక్టులకు సైతం ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. 2018లో ప్రజారాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌కు ఐజీబీసీ ప్లాటినం సర్టిఫికెట్ లభించడం రాష్ట్ర ప్రభుత్వం సస్టైనబుల్ అర్బన్ ప్లానింగ్ పట్ల తీసుకున్న ముందడుగుకు నిదర్శనమన్నారు.
ఈ గుర్తింపు రావడానికి కమిషనర్ కె. కన్నబాబు , వారి సమర్ధవంతమైన నాయకత్వం, అడిషనల్ కమిషనర్ ఏ. భార్గవ తేజ వ్యూహాత్మక మార్గదర్శకత్వం ప్రధాన కారణమని.. అదే విధంగా సిఆర్డిఏ ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) ఆర్. గోపాలకృష్ణా రెడ్డి, చీఫ్ ఇంజనీర్(హౌసింగ్ & ఆఫీస్) పి.వి.కె. భాస్కర్, చీఫ్ ఆర్కిటెక్ట్ & డిజైన్ కోఆర్డినేటర్ సందీప్ దీక్షిత్ కీలకపాత్ర పోషించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ఐజీబీసీ అందజేసిన ఈ గుర్తింపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఏపీ సిఆర్డిఏ సంస్థకు గర్వకారణంగా, అలాగే మన రాష్ట్రం యొక్క శక్తి వనరుల నిర్వహణ, సుస్థిర భవనాల నిర్మాణ దిశగా తీసుకుంటున్న చొరవను ప్రతిబింబిస్తుందని తెలిపారు.
సీఐఐ–ఐజీబీసీ భాగస్వామ్యంతో 2040 నాటికి అమరావతిలో “నెట్ జీరో” లక్ష్యాన్ని చేరుకునే దిశగా, అమరావతిని భారతదేశపు సుస్థిరమైన హరిత రాజధానిగా నిలపాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చడంలో సిఆర్డిఏ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలియజేశారు.
