Let's talk: editor@tmv.in
సింగరేణి సంస్థ అవినీతిపై విచారణకు ప్ర‌భుత్వం సిద్ధమా?: కవిత సవాల్

సింగరేణి సంస్థ అవినీతిపై విచారణకు ప్ర‌భుత్వం సిద్ధమా?: కవిత సవాల్

Gaddamidi Naveen
6 ఏప్రిల్, 2026

సింగరేణి కార్మికుల నియామకాలపై విజిలెన్స్, ఏసీబీ విచారణ జరిపిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలను కవిత తీవ్రంగా ఖండించారు. కార్మికుల చెమటతో నడుస్తున్న సంస్థపై విచారణలు కాదని, ప్రభుత్వ హయాంలో జరుగుతున్న వేల కోట్ల కుంభకోణాలపై విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో, హెచ్ఎంఎస్ సహకారంతో “సేవ్ సింగరేణి” పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ సింగరేణిని కాపాడుకునేందుకు అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధమని స్పష్టం చేశారు. కార్మికుల నియామకాలపై విచారణలు చేయడం కాకుండా ప్రభుత్వ అవినీతి అంశాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వడం అప్పటి ప్రభుత్వ విధానమని పేర్కొన్న ఆమె, ఇప్పుడు వాటిపై విచారణలు చేపట్టడం అన్యాయమని అన్నారు. కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ముందుగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి కార్మికుల ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

సింగరేణి కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గు తవ్వుతున్నారని, వారి కష్టాలు ప్రభుత్వం గుర్తించడంలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు గనుల్లో పని చేసే కార్మికులు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారి సేవలను గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గతంలో సింగరేణి సంస్థ కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించిందని, ఇప్పుడు పరిస్థితులు తిరిగి వెనక్కి వెళ్లుతున్నాయని అన్నారు.

లిథియం, సోలార్ ఒప్పందాలపై ప్రశ్నలు

అలాగే, సింగరేణికి ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.47 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో కార్మికుల జీతాలు, భద్రతపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. కేవలం రూ. 27 లక్షల ఆదాయం ఉన్న అల్ట్ మిన్ చిన్న సంస్థతో రూ. 2,250 కోట్ల లిథియం రిఫైనరీ ఒప్పందం ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. ఈ సంస్థ వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరని నిలదీశారు.ఆ సంస్థ సామర్థ్యం, బ్యాంక్ గ్యారంటీలు వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఈ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ దర్యాప్తు చేపట్టాలని కోరారు. రాజస్థాన్‌లో సోలార్ ఒప్పందం పేరుతో రూ. 11 వేల కోట్ల ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, ఒక మెగావాట్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు కంటే మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చూపిస్తున్నారని ఆరోపించారు.

కాగ్ నివేదిక ప్రకారం డీజిల్ కుంభకోణం, నిబంధనల ఉల్లంఘన వల్ల సంస్థకు జరిగిన వేల కోట్ల నష్టంపై ముందు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇంకా, సింగరేణిలో నిలిచిపోయిన మెడికల్ బోర్డును పాత పద్ధతిలో వెంటనే పునరుద్ధరించాలి. ఇది రిస్క్ సెక్టార్ కాబట్టి, కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ నుండి మినహాయింపు ఇవ్వాలి.వైద్య పరీక్షల్లో పాసైన 350 మందికి వెంటనే నియామకాలు చేపట్టాలని ఆమె తెలిపారు. ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టులను భర్తీ చేయాలి. నిమ్స్ రేట్లకు బదులుగా కేంద్ర ప్రభుత్వ సీజీహెచ్ఎస్ రేట్లను వర్తింపజేయాలని క‌విత సూచించారు. హెచ్‌ఎంఎస్ చేపట్టే ప్రతి పోరాటానికి తెలంగాణ జాగృతి పూర్తి మద్దతు ఉంటుందని, అవసరమైతే సింగరేణి విముక్తి కోసం మరో తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాడుతామని కవిత స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ప్రసాద్, పెద్ద సంఖ్యలో సింగరేణి కార్మికులు పాల్గొన్నారు.