Let's talk: editor@tmv.in
సింగరేణి కార్యాలయం వద్ద బీజేపీ ధర్నా: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అరెస్ట్

సింగరేణి కార్యాలయం వద్ద బీజేపీ ధర్నా: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అరెస్ట్

Gaddamidi Naveen
13 డిసెంబర్, 2025

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నిధులను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్‌లోని సింగరేణి హెడ్‌ఆఫీసు వద్ద ధర్నాకు దిగారు. ప్రజల ధనం అయిన సింగరేణి నిధులను ఫుట్‌బాల్ టోర్నమెంట్ కోసం, ముఖ్యంగా మెస్సీ, రేవంత్ ఫుట్‌బాల్ ఈవెంట్ పేరుతో భారీ మొత్తాలను కేటాయించడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన తీవ్రంగా విమర్శించారు.

ఈ కార్యక్రమానికి భారీగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు. సింగరేణి ఉద్యోగుల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి కోసం వినియోగించాల్సిన వేల కోట్ల రూపాయలు క్రీడా కార్యక్రమాల పేరుతో ఖర్చు చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయమని ఏలేటి తెలిపారు. సింగరేణి ఒక ప్రజా సంస్థ అని, దాని నిధులను ఖర్చు చేసేటపుడు పారదర్శకత, అవసరాల ప్రాధాన్యత ఉండాలని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ధర్నా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, పోలీస్‌లు వెంటనే జోక్యం చేసుకున్నారు. అనుమతి లేకుండా ఆందోళన చేపట్టారని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని పేర్కొంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని బేగం బజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.బీజేపీ నేతల అరెస్టుతో పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ధనాన్ని రక్షించాలనే ఉద్దేశంతో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన నాయకులను అరెస్ట్ చేయడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని వారు విమర్శించారు.

సింగరేణి కార్యాలయం వద్ద బీజేపీ ధర్నా: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అరెస్ట్ - Tholi Paluku