Let's talk: editor@tmv.in
సింగరేణి కార్మికుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సింగరేణి కార్మికుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Gaddamidi Naveen
15 జులై, 2026

సింగరేణి సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు కార్మికుల సంక్షేమాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. తాడిచెర్ల-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించిన నేపథ్యంలో చేపట్టిన “సింగరేణి భరోసా యాత్ర” రెండో రోజు రామగుండం, గోదావరిఖనిలో ఉత్సాహంగా సాగిందన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడిన ఆయన, దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని ఆదాయ వనరుగా మాత్రమే ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. కార్మికుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయడంతో సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. ఒకప్పుడు 70 వేల మంది ఉద్యోగులు ఉన్న సింగరేణిలో ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య 40 వేల వరకు తగ్గిపోయిందని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దేశంలో బొగ్గు బ్లాకుల కేటాయింపు వేలం ద్వారానే జరుగుతున్నప్పటికీ, తెలంగాణపై ప్రత్యేక దృష్టితో దాదాపు 11 ఏళ్ల తర్వాత ఎలాంటి వేలం లేకుండా తాడిచెర్ల-2 బ్లాక్‌ను నేరుగా సింగరేణికి కేటాయించామని చెప్పారు. గత రెండు దశాబ్దాలుగా కార్మికులు కోరుతున్న ఈ బ్లాక్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఆమోదించారని వెల్లడించారు. తెలంగాణ, సింగరేణి చరిత్రలోనే అతిపెద్ద బొగ్గు బ్లాక్‌గా నిలిచిన తాడిచెర్ల-2లో సుమారు 350 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, రాబోయే 40 నుంచి 50 ఏళ్ల పాటు ఉత్పత్తి కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు ద్వారా రూ.1.20 లక్షల కోట్లకు పైగా టర్నోవర్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

అలాగే ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్‌లో ఉత్పత్తి ప్రారంభానికి కూడా కేంద్రం చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుందని అన్నారు. తాడిచెర్ల-2 బ్లాక్‌కు అవసరమైన అనుమతులను వేగంగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించేందుకు సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్. రామ‌చందర్ రావు, ఎంపీలు ఈటల రాజేందర్, గొడం నగేశ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ మహేష్ రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, పెద్దపల్లి జిల్లా పార్టీ శ్రేణులు, కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
SingareniTadicherla2CoalBlockKishanReddyNarendraModiTelanganaSCCLCoalMiningSingareniWorkersMiningSectorRamagundamGodavarikhani
సింగరేణి కార్మికుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి - Tholi Paluku