
సింగరేణి కార్మికులకు రూ.1 కోటి ప్రమాద భీమా అందిస్తున్నాం: డిప్యూటీ సీఎం భట్టి
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి రూ.1 కోటి విలువైన ప్రమాద భీమా సదుపాయం అందిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ మంగళవారం శాసనసభలో తెలిపారు. ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న గనుల రంగంలో పనిచేస్తున్న కార్మికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. విధి నిర్వహణలో లేదా ఇతర సందర్భాల్లో ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు, కార్మిక కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ భీమా లక్ష్యమని డిప్యూటీ సీఎం తెలిపారు.
కార్మికుల ప్రాణభద్రత, హక్కుల పరిరక్షణ ప్రజా ప్రభుత్వానికి కీలక బాధ్యతగా భావిస్తున్నామని డిప్యూటీ సీఎం అన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు ప్రమాద భీమా ద్వారా కార్మికుల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంచే చర్యగా అభివర్ణిస్తున్నారు.
ఇదే తరహాలో, త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు కూడా ప్రమాద భీమా సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ సమాన భద్రతా హక్కులు కల్పించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగుల సంక్షేమమే అభివృద్ధికి పునాది అన్న దృఢ నమ్మకంతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
