
సింగరేణి కార్మికులకు ద్రోహం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: హరీష్‌రావు ఆరోపణలు
సింగరేణి కార్మికుల సమస్యలు, వారసత్వ ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. సింగరేణి సీఎండీతో పాటు డైరెక్టర్ గౌతమ్‌ను కలిసి వినతి పత్రం అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కార్మికుల జీవన భద్రతను గాలికొదిలేసి ప్రభుత్వం రాజకీయ డ్రామాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
సింగరేణి నిధుల దుర్వినియోగంపై ధ్వజం
సింగరేణి కార్మికులకు జీతాలు చెల్లించడానికి ప్రభుత్వానికి డబ్బులు లేవని, అయితే రూ.10 కోట్ల ప్రజాధనంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫుట్‌బాల్ షో నిర్వహించడమేంటని ప్రశ్నించారు. సింగరేణి పైసలతో ఫుట్‌బాల్ ఆడినవ్ రేవంత్… నీ అయ్య సొత్తా? అంటూ హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కార్మికులు కష్టపడి సంపాదించిన నిధులను ముఖ్యమంత్రి తన సోకులకు వినియోగించుకోవడం దుర్మార్గమన్నారు.
సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు కల్పించడంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని హరీష్ రావు విమర్శించారు. కార్మిక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఈ అంశంపై మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు కొప్పుల ఈశ్వర్, టీబీజీకేఎస్ నేతలు సింగరేణి యాజమాన్యానికి వినతి పత్రం అందజేశారని తెలిపారు.
జర్నలిస్టుల అక్రమ అరెస్టుల ఖండన
అదే విధంగా జర్నలిస్టుల అక్రమ అరెస్టులను బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని హరీశ్‌రావు చెప్పారు. రాష్ట్రంలో “ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం” అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రశ్నించిన వారిని అరెస్టు చేయడం ద్వారా ఉక్కుపాదంతో అణిచివేస్తోందని ఆయన ఆరోపించారు. ధర్నా చేసే హక్కు, వినతి పత్రం ఇచ్చే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. ఇదేనా కాంగ్రెస్ చెప్పిన ఏడవ గ్యారంటీ అని ఆయన ఎద్దేవా చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో జర్నలిస్టులకు 26 వేల అక్రిడేషన్ కార్డులు ఇచ్చామని, రిపోర్టింగ్ జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు అనే తేడా లేకుండా అందరికీ గౌరవం కల్పించామని ఆయన గుర్తుచేశారు. అయితే అధికారంలోకి వస్తే ఇండ్లు, స్థలాలు ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి, అక్రిడేషన్ కార్డులను 10 వేలకు తగ్గించడం దారుణమన్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ జర్నలిస్టులను ఉగ్రవాదులతో పోల్చడం అత్యంత ఖండనీయమని ఆయన తెలిపారు.
అసెంబ్లీలో తేల్చుకుంటాం
జర్నలిస్టుల పోరాటానికి బీఆర్‌ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేసిన హరీశ్‌రావు, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రకటించారు. సింగరేణి కార్మికులు, జర్నలిస్టుల హక్కుల కోసం బీఆర్‌ఎస్ పోరాటం ఆగదని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
