Let's talk: editor@tmv.in
సింగరేణి అధికారుల సమస్యలు త్వరగా పరిష్కరించండి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సింగరేణి అధికారుల సమస్యలు త్వరగా పరిష్కరించండి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Gaddamidi Naveen
14 జులై, 2026

సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న సుమారు 2,200 మంది అధికారుల సమస్యలపై వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. కోల్ ఇండియా తరహాలోనే సింగరేణి అధికారుల వేతన సవరణ, పర్‌ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ (పీఆర్పీ) అమలుపై అధికార సంఘం చేసిన విజ్ఞప్తులను ప్రాధాన్యంగా తీసుకుని, రానున్న రెండు మూడు నెలల్లో సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు.

ఇటీవల ప్రజా ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవతో తాడిచర్ల-2 బ్లాక్‌కు మైనింగ్ లీజు మంజూరు కావడంలో కీలక పాత్ర పోషించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సింగరేణి అధికార సంఘం నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన భట్టి విక్రమార్క.. సోమవారం ఉదయం సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, డైరెక్టర్ గౌతమ్ పోట్రులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఇంధన భద్రతను అందించడంలో సింగరేణి కార్మికులు, అధికారులు విశేష కృషి చేస్తున్నారని, అధికారుల్లో ఎలాంటి అసంతృప్తి లేకుండా యాజమాన్యం భరోసా కల్పించాలని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. పెరుగుతున్న అంతర్జాతీయ పోటీని తట్టుకునేలా బొగ్గు ఉత్పత్తి, విక్రయాల్లో సింగరేణి పోటీతత్వాన్ని పెంపొందించాలని, సంస్థను బహుముఖ రంగాల్లో విస్తరించేందుకు అధికారులు కీలక పాత్ర పోషించాలని భట్టి విక్రమార్క సూచించారు.

తమ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేయడంపై సింగరేణి అధికార సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి పెద్ది నరసింహులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంస్థ పురోగతికి, ప్రభుత్వ కార్యక్రమాలకు అధికారుల తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు
SingareniSCCLBhattiVikramarkaTelanganaCoalIndustryMiningSectorEmployeeWelfareWageRevisionPRPSingareniOfficersTelanganaGovernment
సింగరేణి అధికారుల సమస్యలు త్వరగా పరిష్కరించండి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క - Tholi Paluku