Let's talk: editor@tmv.in
సింగరేణిలో సౌర విద్యుత్ కుంభకోణం: మాజీ మంత్రి హరీష్‌ రావు

సింగరేణిలో సౌర విద్యుత్ కుంభకోణం: మాజీ మంత్రి హరీష్‌ రావు

Gaddamidi Naveen
24 జనవరి, 2026

సింగరేణి కాలరీస్ కంపెనీలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి మరోసారి లేఖ రాశారు. సింగరేణిలో ఇటీవల జరిగిన పలు ప్రాజెక్టులు, టెండర్లలో వేల కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని ఆయన లేఖలో వివరించారు. ముఖ్యంగా సౌర విద్యుత్ ప్రాజెక్టులు, జెలటిన్ కొనుగోళ్లు, ఓపెన్ కాస్ట్ పనులలో తీవ్రమైన అక్రమాలు జరిగినట్లు పేర్కొన్నారు.

మొదటిగా 107 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టిన సౌర విద్యుత్ ప్రాజెక్టుల వ్యవహారాన్ని హరీష్ రావు ప్రస్తావించారు. మూడు వేర్వేరు సౌర ప్రాజెక్టులను ఒకే టెండర్‌గా కలపడం ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు పోటీ నుంచి తప్పించబడ్డాయని ఆరోపించారు. సైట్ విజిట్ నిబంధనను ఉద్దేశపూర్వకంగా ఉపయోగించి గుజరాత్‌కు చెందిన ఒక కన్సార్షియంకు కాంట్రాక్టులు దక్కేలా చేశారని తెలిపారు. ఒక్కో మెగావాటుకు రూ.5.04 కోట్ల చొప్పున కాంట్రాక్టులు కేటాయించగా, దేశవ్యాప్తంగా సగటు ధర రూ.3 నుంచి రూ.4 కోట్ల మధ్యనే ఉందని పేర్కొన్నారు. ఈ ఒక్క ప్రాజెక్ట్ ద్వారానే రూ.200–250 కోట్ల మేర అదనపు భారం పడినట్లు ఆయన అంచనా వేశారు.

ఇక రామగుండం సౌర విద్యుత్ ప్రాజెక్ట్ (67 మెగావాట్లు) విషయంలోనూ తీవ్ర అవకతవకలు జరిగాయని హరీష్ రావు తెలిపారు. ఈ ప్రాజెక్టును ఒక్కో మెగావాటుకు రూ.7.16 కోట్లకు అప్పగించారని, ఇది జాతీయ సగటుతో పోలిస్తే దాదాపు రెట్టింపు అని అన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్లే మరో రూ.200–250 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. రెండు సౌర ప్రాజెక్టుల కలిపి నష్టం దాదాపు రూ.500 కోట్ల వరకు ఉంటుందని ఆయన ఆరోపించారు.

జెలటిన్ (విస్ఫోటకాలు) కొనుగోళ్లలోనూ అక్రమాలు జరిగాయని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. కోల్ ఇండియాతో పోలిస్తే సుమారు 30 శాతం అధిక ధరలకు జెలటిన్ కొనుగోలు చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రశ్నించిన డైరెక్టర్లను బలవంతంగా రాజీనామాలు చేయించారని లేదా హోదా తగ్గించారని తెలిపారు.

అదేవిధంగా ప్రకాశం ఖని (మణుగూరు) ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లో 1,044 కోట్ల విలువైన స్కామ్ జరిగిందని హరీష్ రావు ఆరోపించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్లను ఎంపిక చేసిన సంస్థలకే జారీ చేసి, టెండర్‌ను మలుపు తిప్పారని అన్నారు. పోటీదారులను భయభ్రాంతులకు గురిచేసిన ఘటనలున్నాయని తెలిపారు. శ్రీరాంపూర్ ఓబీ పనుల విషయంలో కూడా రూ.600 కోట్ల మేర అక్రమాలు జరిగాయని, సాంకేతిక బిడ్లు తెరిచినప్పటికీ టెండర్‌ను ఏడు సార్లు వాయిదా వేసినట్లు ఆయన లేఖలో వివరించారు.

ఈ అన్ని అంశాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, సింగరేణిలో జరిగిన అవకతవకలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు కేంద్ర మంత్రిని కోరారు.