
సింగరేణిలో అక్రమాలపై గవర్నర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో జరుగుతున్న భారీ అక్రమాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసింది. మంగళవారం లోక్ భవన్‌లో గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించిన ఈ బృందంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇతర ముఖ్య నేతలు ఉన్నారు.సింగరేణి సంస్థలో టెండర్లు, కొనుగోళ్లు, విధానపరమైన నిర్ణయాలు, సీఎస్ఆర్ నిధుల వినియోగంలో జరుగుతున్న అవకతవకలపై గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని బీఆర్ఎస్ కోరింది.
నైని బొగ్గు గని కేటాయింపుల్లో జరిగిన నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన ఆధారాలను గవర్నర్‌కు సమర్పించారు. సింగరేణికి చెందిన సీఎస్ఆర్ నిధులను పక్కదారి పట్టించడంపై ఫిర్యాదు చేశారు.సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి అని, దానిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్న వారిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సింగరేణి మనుగడను దెబ్బతీసే ప్రయత్నాలను అడ్డుకోవాలని, పారదర్శకత కోసం ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించాలని గవర్నర్‌ను ప్రతినిధి బృందం కోరింది.
'కోల్ మాఫియా'కు సీఎమే నాయకుడు: కేటీఆర్
సింగరేణి కాలరీస్ సంస్థలో కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకతకు పాతరవేసి, వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.
బీఆర్ఎస్ పార్టీ తరఫున గవర్నర్ కు అన్ని ఆధారాలు, సాక్ష్యపత్రాలతో ఈ సమస్యను వివరించడం జరిగింది. గతంలో మాజీ మంత్రి హరీష్ రావు సింగరేణిలో అవినీతిని పత్రికా సమావేశాల్లో బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైందని, మీడియా సహకారంతో ఈ కుంభకోణం పూర్తిస్థాయిలో బయటపడిందని కేటీఆర్ తెలిపారు.
సింగరేణితో 'ఫుట్ బాల్' ఆట - రూ. 10 కోట్ల దుర్వినియోగం
సింగరేణి కార్మికులు, రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఈ అవినీతి, దోపిడీపై స్పష్ట అవగాహన కలిగి ఉన్నారని, కానీ ఇప్పటి వరకు ప్రధానమంత్రి, మంత్రి, అధికార ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానమూ రాలేదు. సింగరేణి నిధులను ఫుట్‌బాల్ ఆటకు వినియోగించడం, 10 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందని, టెండర్లలో పారదర్శకత, సైట్ విజిట్ సర్టిఫికేషన్ విధానం తప్పనిసరిగా కొత్తగా ఎందుకు అమలులోకి తెచ్చారో కూడా ఎవరూ వివరణ ఇవ్వలేదని కేటీఆర్ విమర్శించారు.
సోలార్, ఎక్స్‌ప్లోజివ్స్ స్కామ్
అలాగే, సింగరేణిలోని అన్ని టెండర్లు, సోలార్ పవర్ ప్రాజెక్టులు, ఎక్స్‌ప్లోజివ్స్, జిలెటిన్ స్టిక్స్ తదితర వ్యవహారాలలో అవినీతికి పాల్పడుతున్న విధానాలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని కాంట్రాక్టర్ కంపెనీలకు ప్రత్యేక లాభం, మిగతా సంస్థలను పక్కన పెట్టడం, బోర్డ్ డైరెక్టర్లపై వ్యతిరేక చర్యలు తీసుకోవడం వంటి దుర్మార్గ వ్యవహారాలు వివరించబడ్డాయి.
సింగరేణి టెండర్లలో కొత్త నిబంధన ఎవరి లాభం కోసం?
గతంలో ఎన్నడూ లేని విధంగా టెండర్లలో ‘సైట్ విజిట్ సర్టిఫికేషన్’ అనే కొత్త నిబంధనను ప్రవేశపెట్టడంపై అనుమానాలు వ్యక్తం చేసింది. టెండర్ వేయాలంటే తప్పనిసరిగా సైట్‌కి వెళ్లి సర్టిఫికెట్ తెచ్చుకోవాలనే ఈ షరతు పారదర్శకత కోసమా, లేక కొందరికి లాభం చేకూర్చడానికేనా అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఈ అంశంపై స్పందించాల్సిన ముఖ్యమంత్రి మాత్రం సింగరేణితో ఫుట్‌బాల్ ఆడటం లేదా విదేశాల్లో పర్యటనల పేరుతో ఫోజులు కొడుతున్నారని విమర్శించారు. బాధ్యత వహించాల్సిన సమయంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. 2018 నుంచి 2024 మధ్య కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను సిఫారసు చేసినా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని కేటీఆర్ గుర్తు చేశారు. అప్పట్లో అన్ని టెండర్లను పూర్తిగా పారదర్శకంగా పిలిచామని, అందుకే ఎస్టిమేటెడ్ కాస్ట్ కంటే తక్కువ ధరలతో మైనస్ టెండర్లు వచ్చి సింగరేణికి భారీగా ఆదా జరిగిందని తెలిపారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లలో లేని ఈ కొత్త షరతు ఎందుకు పెట్టారో ఇప్పటివరకు సమాధానం లేదని, ఇది స్పష్టంగా అనుమానాలకు తావిస్తున్న చర్యగా బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.
సమగ్ర విచారణకు డిమాండ్
ప్రజా ధనాన్ని దోచుకుంటున్న ఈ కుంభకోణాలపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరినట్లు కేటీఆర్ తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దీనిపై స్పందించి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి కాబట్టే, దృష్టి మళ్లించడానికి విచారణల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు.
