Let's talk: editor@tmv.in
సింగరేణిపై విషపు రాతలు ఆపండి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సింగరేణిపై విషపు రాతలు ఆపండి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Gaddamidi Naveen
25 జనవరి, 2026

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న సింగరేణి సంస్థపై, తనపై వస్తున్న అసత్య కథనాలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ఏబీఎన్ రాధాకృష్ణ 'తొలి పలుకు' పేరుతో రాస్తున్న కథనాలు పూర్తిగా కట్టుకథలని, సింగరేణి కార్మికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు.

ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయి? రాధాకృష్ణ తొలి పలుకుల వెనుక ఏ రాబందుల, ఏ గద్దల, ఏ దోపిడీదారుల ప్రయోజనాలు ఉన్నాయో ప్రజలు గమనించాలి అని డిప్యూటీ సీఎం తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రజల సంక్షేమం, సమర్థవంతమైన పాలన, సింగరేణి సంస్థ ఆస్తుల పరిరక్షణనే లక్ష్యంగా పనిచేస్తున్న తనపై ఇలాంటి దుష్ప్రచారాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు.

సింగరేణి సంస్థలో టెండర్లు లేదా వాటికి సంబంధించిన ఫైళ్లు తన వద్దకుగానీ, రాష్ట్ర ప్రభుత్వానికి గానీ రావని ఆయన స్పష్టంగా చెప్పారు. సింగరేణి ఒక స్వయంప్రతిపత్తి సంస్థ అని, సంస్థ బోర్డు, సీనియర్ అధికారులు అక్కడ అమలులో ఉన్న విధివిధానాలు, నిబంధనల ప్రకారమే పూర్తిగా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటారని వివరించారు. రాజకీయ జోక్యానికి ఎక్కడా అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు.

నైనీ బ్లాక్ టెండర్లపై క్లారిటీ

నైనీ బొగ్గు బ్లాకు టెండర్ విషయంలో ప్రస్తావిస్తున్న ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ నిబంధన కొత్తది కాదని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ నిబంధన 2018 నుంచే అమల్లో ఉందని, 2018, 2021, 2023 సంవత్సరాల్లో సీఎంపీడీఐఎల్ రూపొందించిన టెండర్ డాక్యుమెంట్లలో కూడా ఇదే నిబంధన స్పష్టంగా ఉందన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ప్రవేశపెట్టిన విధానం కాదని ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా, కోల్ ఇండియా, ఎన్ఎండీసీ, ఐఐటీ, ఐఐఎం, డిఫెన్స్ విభాగం, ఫైనాన్స్ శాఖ, గుజరాత్ ప్రభుత్వ రంగ సంస్థలు సహా దేశవ్యాప్తంగా అనేక ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఈ విధానం ఎన్నేళ్లుగా అమల్లో ఉందని తెలిపారు. ఆధారాలతో సహా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నామని, తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు.

డీజిల్ సరఫరాలో పాత విధానం

దేశంలో మైనింగ్ కార్యకలాపాలు గానీ, ఇతర కాంట్రాక్టు పనులు గానీ నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు లేదా ప్రభుత్వ విభాగాలు కాంట్రాక్టర్లు వినియోగించే వాహనాలకు నేరుగా డీజిల్ సరఫరా చేసే విధానం ఎక్కడా లేదని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కోల్ ఇండియా, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు, ఏ రంగంలోనూ ఇలాంటి విధానం లేదని తెలిపారు. అయితే సింగరేణిలో మాత్రమే ఇది పాతకాలం నుంచి కొనసాగుతున్న విధానమని ఆయన పేర్కొన్నారు.

కాంట్రాక్టర్లు ఏ రకమైన వాహనాలు వినియోగిస్తారో, వాటి సామర్థ్యం, మైలేజ్ ఎంతన్నది తెలియని పరిస్థితుల్లో ఒకే విధమైన డీజిల్ లెక్క విధించడం అసాధ్యమని డిప్యూటీ సీఎం వివరించారు. నేటి ఆధునిక సాంకేతిక పరిస్థితుల్లో వాహనాల మైలేజ్‌లో భారీ తేడాలు ఉన్నాయని చెప్పారు. ఫార్చునర్ వాహనం ఒక లీటర్ డీజిల్‌తో 10–12 కిలోమీటర్లు వెళ్తే, ల్యాండ్ క్రూజర్‌కు కేవలం 3–5 కిలోమీటర్లే వస్తుందని, మరికొన్ని వాహనాలు 20 కిలోమీటర్ల వరకు వెళ్లగలవని ఉదాహరణగా తెలిపారు. అలాగే హెవీ మెషినరీకి కొత్త టెక్నాలజీ కారణంగా ఎక్కువ వినియోగం ఉంటే, లోకల్ వాహనాలకు తక్కువ వినియోగం ఉంటుందని చెప్పారు.

ఇదే విధానంలో గతంలో రెండు ప్రాంతాల్లో భారీ డీజిల్ దోపిడీలు జరిగి పెద్ద స్కామ్‌లుగా మారాయని, ఆ ఘటనలపై ఇప్పటికీ విజిలెన్స్ కేసులు కొనసాగుతున్నాయని ఆయ‌న‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలులో ఉన్న విధానాలను పూర్తిగా అధ్యయనం చేయాలని సింగరేణి మేనేజ్‌మెంట్‌కు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. డీజిల్ విషయంలో ఎలాంటి దోపిడీకి అవకాశం లేకుండా కఠినమైన విజిలెన్స్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించినట్లు ఆయ‌న‌ తెలిపారు.

జీఎస్టీ భారం - ఆర్థిక ప్రయోజనాలు

మరో కీలక అంశంగా బొగ్గుపై జీఎస్టీ పెంపును ప్రస్తావించారు. గతంలో బొగ్గుపై 5 శాతం జీఎస్టీ ఉండగా, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దానిని 18 శాతానికి పెంచిందని చెప్పారు. ఇన్‌పుట్–అవుట్‌పుట్ సమతుల్యత సరిగా లేకపోతే ఆ భారం మొత్తం సింగరేణి సంస్థపై పడుతుందని, అలా జరిగితే సంస్థ ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని ఆయ‌న‌ హెచ్చరించారు.

టెండర్ల రద్దు వెనుక అసలు కారణం

టెండర్లు ఎందుకు రద్దు చేశారన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమిచ్చారు. అందుకే సింగరేణి ప్రయోజనాలను కాపాడేలా, సంస్థపై భారం పడకుండా, పూర్తిగా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రజలకు వాస్తవాలు తెలియకముందే ఊహాగానాలు, ఆరోపణలు పెరగకుండా ఉండేందుకే టెండర్లను తాత్కాలికంగా రద్దు చేశామని చెప్పారు.సింగరేణి తెలంగాణ ఆత్మ. ఈ సంస్థకు నష్టం కలిగించే ఏ నిర్ణయానికీ నేను అవకాశం ఇవ్వను అని భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. సంస్థ ప్రయోజనాలు, పారదర్శకత ప్రజల విశ్వాసమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతని ఆయన పునరుద్ఘాటించారు.

సింగరేణిపై విషపు రాతలు ఆపండి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క - Tholi Paluku