
సింగపూర్ గ్రాండ్‌ప్రి విజేత జార్జ్ రస్సెల్
ఫార్ములా వన్ చరిత్రలో అత్యంత సవాలుతో కూడిన సర్క్యూట్‌లలో ఒకటైన సింగపూర్ గ్రాండ్‌ప్రి రేసులో మెర్సిడెజ్ డ్రైవర్ జార్జ్ రస్సెల్ పోల్ పొజిషన్ నుండి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి విజేతగా నిలిచాడు. ఈ విజయం అతడికి ఈ సీజన్‌లో రెండోదిగా నమోదైంది. మరోవైపు ఈ రేసులో డిఫెండింగ్ ఛాంపియన్ మాక్స్ వెర్‌స్టాపెన్ రెండో స్థానం, లాండో నోరిస్ మూడో స్థానం, ఆస్కార్ పియాస్త్రి నాలుగో స్థానంలో నిలవడంతో మెక్‌లారెన్ జట్టు మరో ఆరు రేసులు మిగిలి ఉండగానే ‘కన్‌స్ట్రక్టర్స్ ఛాంపియన్‌షిప్’ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
రస్సెల్ సంపూర్ణ ఆధిపత్యం
పోల్ పొజిషన్ (మొదటి స్థానం) నుండి రేసును ప్రారంభించిన రస్సెల్, మొదటి ల్యాప్ నుంచే తన లీడ్‌ను పటిష్టం చేసుకున్నాడు. మెర్సిడెజ్ కారు ఈ కఠినమైన ట్రాక్‌పై ఊహించని వేగాన్ని ప్రదర్శించింది. రెండేళ్ల క్రితం ఇదే ట్రాక్‌పై చివరి ల్యాప్‌లో ప్రమాదానికి గురైన రస్సెల్‌కు అదే చోట విజయం సాధించడం ఓ భావోద్వేగ ఘట్టం. విజయం అనంతరం రస్సెల్ మాట్లాడుతూ, “ఈ అనుభూతి చాలా సంతోషాన్ని ఇచ్చింది. రెండేళ్ల క్రితం ఇక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆరోజు నేను పోడియంపై నిలబడలేకపోయాను. ఇప్పుడు అది సాధ్యమైంది" అని అన్నారు.
రెండో స్థానంలో వెర్‌స్టాపెన్
రెడ్ బుల్‌కు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ మాక్స్ వెర్‌స్టాపెన్ రేసు అంతటా కారు సమస్యలతో పోరాడాడు. ముఖ్యంగా అతడికి డౌన్‌షిఫ్ట్‌లలో సమస్యలు వచ్చాయని, వెనుక బ్రేకులు హ్యాండ్‌బ్రేక్‌లాగా అనిపించాయని వెర్‌స్టాపెన్ తెలిపాడు. అయినప్పటికీ వెనుక నుండి లాండో నోరిస్ నుండి వచ్చిన తీవ్ర ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొని రెండో స్థానంలో నిలవగలిగాడు.
మెక్‌లారెన్ డ్రైవర్ల వాగ్వాదం
మెక్‌లారెన్‌కు కన్‌స్ట్రక్టర్స్ టైటిల్‌ను ఖాయం చేసినప్పటికీ, ఆ జట్టు డ్రైవర్లు నోరిస్, పియాస్త్రి మధ్య ప్రారంభంలో జరిగిన వాగ్వాదం హాట్ టాపిక్‌గా మారింది. రేసు ప్రారంభంలో నోరిస్ దూకుడుగా పియాస్త్రిని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఇద్దరి కార్లు ఢీకొన్నాయి. దీనిపై పియాస్త్రి టీమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోరిస్ ఈ రేసులో మూడవ స్థానం, పియాస్త్రి నాల్గవ స్థానం సాధించడం ద్వారా మెక్‌లారెన్ జట్టు రెండోసారి వరుసగా కన్‌స్ట్రక్టర్స్ టైటిల్‌ను దక్కించుకుంది.
హమిల్టన్ కారు బ్రేకులు ఫెయిల్
రేసు చివరి ల్యాప్‌లలో ఏడుసార్లు ప్రపంచ చాంపియన్, ఫెరారీ డ్రైవర్ లూయిస్ హమిల్టన్ కారు బ్రేకులు ఫెయిల్ కావడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. దీని కారణంగా చార్లెస్ లెక్‌లర్క్ అతడిని దాటి ఆరో స్థానంలోకి వెళ్లాడు. చివరికి కారు అదుపు తప్పి పదేపదే ట్రాక్ దాటి డ్రైవ్ చేసినందుకు హమిల్టన్‌కు ఐదు సెకన్ల టైమ్ పెనాల్టీ విధించారు. దీంతో అతడు 7వ స్థానం నుండి 8వ స్థానానికి పడిపోయాడు. ఆస్టన్ మార్టిన్‌కు చెందిన ఫెర్నాండో అలోన్సో 7వ స్థానంలో నిలిచాడు. కాగా తదుపరి రేసు ఈ నెల 20న యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్‌ప్రి జరగనుంది.
