
సాయి సుదర్శన్ గాయంపై బీసీసీఐ క్లారిటీ
వెస్టిండీస్‌తో రెండో టెస్టు రెండో రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తుండగా టీమిండియా యువ క్రికెటర్ సాయి సుదర్శన్ గాయపడిన విషయం తెలిసిందే. విండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ కొట్టిన షాట్‌ను ఆపిన సాయి దానిని అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు. అయితే బంతి చేతికి బలంగా తాకడంతో నొప్పి భరించలేకపోయాడు. వెంటనే మైదానం వదిలి వెళ్లిపోయాడు. అనంతరం అతడి స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా దేవదుత్ పడిక్కల్ వచ్చాడు. అప్పటి నుంచి సాయి సుదర్శన్ గాయంపై క్రీడాభిమానులు ఆందోళన చెందుతూనే ఉన్నారు. అయితే తాజాగా సాయి సుదర్శన్ గాయంపై బీసీసీఐ స్పందించింది. ఆయనకు అయిన గాయంపై ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘విండీస్‌తో రెండో టెస్టు రెండో రోజు ఆట సమయంలో సాయి సుదర్శన్‌కు గాయం అయ్యింది. క్యాచ్‌ను పట్టుకునే సమయంలో బాల్ చేతికి బలంగా తాకింది. ముందు జాగ్రత్తగా మూడో రోజు ఆటకు అతడు రాలేదు. అయితే గాయం మరీ అంత తీవ్రమైనదేమీ కాదు. ప్రస్తుతం సాయి బాగానే ఉన్నాడు. బీసీసీఐ వైద్య బృందం అతడి ఆరోగ్య పరిస్థితిని నిత్యం పర్యవేక్షిస్తోంది. అవసరమైన చికిత్స అందిస్తున్నారు” అని బీసీసీఐ వెల్లడించింది. సాయి సుదర్శన్ బ్యాటింగ్‌కు దిగుతాడా? లేదా? అనేది మాత్రం వెల్లడించలేదు.
బ్యాటింగ్‌లో సత్తా చాటిన సుదర్శన్
అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజు ఆటలో సాయి సుదర్శన్ 87 పరుగులు చేసి టీమిండియాకు మంచి ఆరంభాన్ని అందించాడు. అయితే వైస్ కెప్టెన్ జోమెల్ వార్రికన్ వేసిన బంతికి బ్యాక్‌ఫుట్ షాట్ ప్రయత్నించి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌కు ముందు, ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్‌పై తన తొలి టెస్ట్ క్యాప్ అందుకున్న సుదర్శన్, ఏడు ఇన్నింగ్స్‌లలో కేవలం 147 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడి టెస్ట్ జట్టులో స్థానంపై విమర్శకులు ప్రశ్నలు లేవనెత్తారు.
బలమైన భాగస్వామ్యం
ఈ టెస్టులో కేఎల్ రాహుల్ 58 పరుగులకే స్టంపౌట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన సుదర్శన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన యశస్వి జైస్వాల్‌తో కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 193 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో టీమిండియా మ్యాచ్‌పై పట్టు సాధించింది. స్పిన్‌ను బాగా ఆడతాడనే పేరు ఉన్నప్పటికీ, మొదటి రోజు సుదర్శన్ ఔటైన తీరుపై స్పందించిన బ్యాటింగ్ కోచ్ కోటక్, వరుసగా తక్కువ పరుగులు చేస్తున్నప్పటికీ, సుదర్శన్ దృఢమైన మనస్తత్వం అతడిని నిలదొక్కుకునేలా చేసిందని వెల్లడించారు.
