
సాయి ఈశ్వర్ మృతి దురదృష్టకరం.. బలిదానాలు చేసుకోవద్దు: మంత్రి పొన్నం
సాయి ఈశ్వర్ మృతి చెందడం దురదృష్టకరం అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇలాంటి బలిదానాలు మరెవరూ చేసుకోరాదని ఆయన విజ్ఞప్తి చేశారు.సాయి ఈశ్వర్ కుటుంబాన్ని ప్రభుత్వం ద్వారా తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సాయి ఈశ్వర్ మరణం పట్ల వారు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ, కుల సర్వే నిర్వహించి, పూర్తి డేటాను సేకరించి, దానిని శాసనసభలో చట్ట రూపంలో కట్టడి చేసిన విషయాన్ని గుర్తు చేశారు.50 శాతం రిజర్వేషన్లు దాటకూడదనే ఇందిరా సహాని కేసు (కృష్ణమూర్తి జడ్జిమెంట్) నిబంధన ఉన్నప్పటికీ, దానిని అధిగమించడానికి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.మేము తీసుకున్న నిర్ణయం, విధానం కంటే బెటర్ పాలసీ ఉంటే చెప్పాలి అని పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ప్రభుత్వం సాయి ఈశ్వర్ కుటుంబాన్ని ఆదుకుంటుందని తెలిపారు. బీసీలకు అన్యాయం జరిగిందంటూ నడిరోడ్డుమీద ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు ఈశ్వర్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందిన విషయం తెలిసిందే.
పంచాయతీ ఎన్నికలపై ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమీక్ష
అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో కీలక సమన్వయ సమావేశం జరిగింది. మండలాల వారీగా పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక పదాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ ఎలా వ్యవహరించాలి, ఏ గ్రామంలో ఏ రీతిలో వ్యూహాలు అమలు చేయాలి, పార్టీ మద్దతుదారులను ఎలా ఘన విజయం దిశగా నడిపించాలి అనే అంశాలపై మంత్రి పొన్నం దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీ అభ్యర్థులు గెలవడమే లక్ష్యంగా 100 శాతం విజయం సాధించాలనే సంకల్పాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులకు ఆ ప్రాంతంలోని ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు సంపూర్ణ మద్దతుగా నిలబడి ప్రచారాన్ని మరింత బలపరచాలని మంత్రి సూచించారు.
