
సామాన్య భక్తులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలి: మంత్రి ఆనం రామనారాయణ
రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మహా శివరాత్రి పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ, సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమగ్ర సమీక్ష నిర్వహించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం, శ్రీకాళహస్తి, కోటప్పకొండతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన శైవ ఆలయాల్లో తీసుకోవాల్సిన చర్యలను మంత్రి సమీక్షించారు.
బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ గణనీయంగా పెరిగే అవకాశమున్నందున ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ, పోలీస్ శాఖ, జిల్లా యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు, వసతులపై నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
భక్తుల భద్రత విషయంలోనూ సౌకర్యవంతమైన దర్శనం కల్పించడంలోనూ ఎలాంటి రాజీ ఉండదని మంత్రి ఆనం స్పష్టంగా చేశారు. దీక్షలు, మాలధారణలతో ఎంతో కష్టపడి ఆలయాలకు వచ్చే భక్తులను అవమానించేలా లేదా ఇబ్బందులకు గురిచేసేలా ఎవరు వ్యవహరించకూడదని హెచ్చరించారు. సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని వీఐపీ దర్శనాల కారణంగా భక్తులు ఇబ్బంది పడకూడదని అధికారులకు సూచించారు.
ఆలయ ఆచార వ్యవహారాలు, ఉత్సవాలు, కృతువులు, వైదిక ఆగమాలకు సంబంధించిన అంశాల్లో అధికారుల జోక్యం ఉండకూడదని మంత్రి ఆనం స్పష్టం చేశారు. అదే సమయంలో పారిశుధ్య పనులు నిరంతరం చేపట్టి ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, తాగునీరు, పాలు, బిస్కెట్లు వంటి మౌలిక సదుపాయాలు భక్తులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఇప్పటికే జారీ చేసిన ఎస్‌ఓపీలను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.
భక్తుల రద్దీ నియంత్రణకు స్పష్టమైన ప్రణాళికలు అమలు చేయాలని, ప్రసాదం పంపిణీ ఎక్కడా ఆలస్యం కాకుండా సక్రమంగా జరగాలని మంత్రి ఆదేశించారు. టెంపుల్ ఆఫీసర్లు, ఫెస్టివల్ ఆఫీసర్లు మహా శివరాత్రి ఏర్పాట్లు వీఐపీ లతో పాటు సామాన్య భక్తులకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, వారికి కేటాయించిన సమయాల్లోనే దర్శన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
మహా శివరాత్రి పర్వదినాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, రీజినల్ జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు జిల్లా అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన శైవ క్షేత్రాల కార్యనిర్వాహణాధికారులు పాల్గొన్నారు.
