Let's talk: editor@tmv.in
సామాన్యుడిపై 'విద్యుత్' భారం పడనీయం: మంత్రి పార్థసారధి

సామాన్యుడిపై 'విద్యుత్' భారం పడనీయం: మంత్రి పార్థసారధి

Panthagani Anusha
6 జనవరి, 2026

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను మరింత తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి స్పష్టం చేశారు. ఆదివారం నూజివీడులోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్ ఛార్జీలు పెంచబోమని పైగా ప్రస్తుతం ఉన్న ఛార్జీలను మరింత తగ్గించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నారని వెల్లడించారు.

గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యుత్ రంగంపై రూ. 4,789 కోట్ల భారం పడిందని అయితే ఈ ‘ట్రూఅప్’ ఛార్జీలను ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి కీలక ప్రకటన చేశారు. సుపరిపాలన అంటే ప్రజలపై భారం మోపడం కాదు వారిని ఆదుకోవడమేనని మంత్రి పేర్కొన్నారు. గత నవంబర్ నుండి అమలు చేస్తున్న సంస్కరణల వల్ల యూనిట్‌కు రూ.13 వరకు భారాన్ని తగ్గించగలిగామని వివరించారు. 2019 నాటికి తమ హయాంలో విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను, గత ప్రభుత్వం రూ. 1.5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టి అదోగతి పాలు చేసిందని ఆయన మండిపడ్డారు.

విద్యుత్ కొనుగోళ్లలో గత ప్రభుత్వం అవలంబించిన కక్షపూరిత ధోరణిని మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. తమ హయాంలో రూ. 2.49 లకే సోలార్, విండ్ పవర్ ఇచ్చేందుకు కంపెనీలు ముందుకు వచ్చినా గత పాలకులు వాటిని వ్యతిరేకించారని దుయ్యబట్టారు. చౌకగా వచ్చే విద్యుత్‌ను కాదని, బహిరంగ మార్కెట్లో రూ. 5.19 నుంచి రూ. 5.50 వరకు అధిక ధరలకు ఒప్పందాలు చేసుకుని ప్రజల నెత్తిన భారం వేశారని విమర్శించారు. భవిష్యత్తు అవసరాల కోసం సోలార్, విండ్, బయో విద్యుత్ రంగాల్లో 80 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి తక్కువ ధరకే ఒప్పందాలు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ‘పీఎం సూర్య ఘర్ యోజన’ కింద పేదలకు సోలార్ యూనిట్లు అందిస్తున్నామని ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం బీసీలకు అదనంగా రూ. 50 వేల సబ్సిడీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని పార్థసారధి తెలిపారు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులను దారి మళ్లించి గ్రామాలను నిర్వీర్యం చేసిందని ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పర్యవేక్షణలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల కిలోమీటర్ల మేర రోడ్లు ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్ ఇచ్చే పనులు వేగవంతం చేశామన్నారు. రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి విజనరీ నాయకత్వంలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ లక్షలాదిమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించబోతోందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

సామాన్యుడిపై 'విద్యుత్' భారం పడనీయం: మంత్రి పార్థసారధి - Tholi Paluku