Let's talk: editor@tmv.in
సామాజిక భద్రత కోడ్ 2025: ముఖ్యాంశాలు

సామాజిక భద్రత కోడ్ 2025: ముఖ్యాంశాలు

Dantu Vijaya Lakshmi Prasanna
23 నవంబర్, 2025

నవంబర్ 21, 2025 నుండి అమల్లోకి వచ్చిన నాలుగు కార్మిక కోడ్‌లలో ఒకటైన సామాజిక భద్రత కోడ్, 2020, కార్మిక చట్టాల సంక్లిష్టతను ఏకీకృతం చేయడానికి, సరళీకృతం చేయడానికి ఉద్దేశించబడింది.

ప్రభుత్వ ప్రకటన ప్రకారం, ఈ కోడ్ తొమ్మిది ప్రస్తుత కార్మిక చట్టాలను ఒకే సమగ్ర వ్యవస్థలోకి తీసుకువచ్చి, కంప్లైయెన్స్‌ను (నియమపాలనను) సులభతరం చేస్తుంది వ్యవస్థీకృత, అసంఘటిత, గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులకు ప్రయోజనాలను విస్తరిస్తుంది.

ఈ కోడ్, జీవిత, వైకల్య భీమా, ఆరోగ్యం, ప్రసూతి సంరక్షణ, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ నిబంధనలను ఒకే గొడుగు కిందకు తెస్తుంది. డిజిటల్ వ్యవస్థలు, సరళీకృత విధానాల ద్వారా సంక్షేమ ప్రయోజనాల పంపిణీని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడం దీని లక్ష్యం.

ముఖ్య మార్పులు

గ్రాట్యుటీ:

• కొత్త చట్టం ప్రకారం, ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగులు ఇకపై ఐదేళ్ల నిబంధన బదులు, ఒక సంవత్సరం నిరంతర సేవ పూర్తయిన తర్వాత గ్రాట్యుటీకి అర్హులు అవుతారు.

గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులు:

• మొట్టమొదటిసారిగా, గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులకు కూడా సామాజిక భద్రతా ప్రయోజనాలు అందించబడతాయి. వీటి కోసం ప్రభుత్వం రూపొందించే పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అగ్రిగేటర్ల నుండి నిధులు సమకూరుతాయి. వీటిని కొత్తగా ఏర్పడిన జాతీయ సామాజిక భద్రతా బోర్డు పర్యవేక్షిస్తుంది.

ఈపీఎఫ్ విస్తరణ:

• ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌ కవరేజీని పరిశ్రమ రకంతో సంబంధం లేకుండా, 20 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్న అన్ని సంస్థలకు విస్తరించింది. ఇది లక్షలాది మందికి భద్రతా వలయాన్ని విస్తరిస్తుంది.

జాతీయ డేటాబేస్:

• అసంఘటిత కార్మికుల కోసం ఒక జాతీయ డేటాబేస్‌ను తప్పనిసరి చేసింది. దీని ద్వారా ప్రతి కార్మికునికి ఆధార్‌తో అనుసంధానించబడిన ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య లభిస్తుంది, దీని వల్ల వారు దేశంలో ఎక్కడైనా ప్రయోజనాలను పొందవచ్చు.

వేతనం నిర్వచనం:

• అన్ని కార్మిక చట్టాలలో "వేతనం" యొక్క నిర్వచనం ప్రామాణీకరించబడింది. బోనస్‌లు, ఇంటి అద్దె వంటి అలవెన్సులు మొత్తం వేతనంలో 50% కంటే ఎక్కువగా ఉంటే, అవి వేతన గణనలోకి వస్తాయి. ఇది గ్రాట్యుటీ, పెన్షన్ వంటి సామాజిక ప్రయోజనాల విలువను పెంచుతుందని భావిస్తున్నారు.

ఈఎస్ఐసీ కవరేజీ:

• ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ కవరేజీని భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. చిన్న సంస్థలకు స్వచ్ఛందంగా పాల్గొనే అవకాశం కూడా కల్పించబడింది.

ప్రమాద పరిహారం:

• ఉద్యోగ సంబంధిత గాయాల నిర్వచనంలో ప్రయాణ సమయాల్లో జరిగే ప్రమాదాలను కూడా చేర్చింది, తద్వారా ప్రభావిత కార్మికులకు లేదా వారి కుటుంబాలకు పరిహారం లభిస్తుంది.

మహిళా ఉద్యోగులకు ప్రయోజనాలు

ఈ కోడ్‌లో మహిళా ఉద్యోగులకు అనుకూలమైన అనేక నిబంధనలు ఉన్నాయి.

• 26 వారాల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు.

• దత్తత తీసుకునే అద్దె గర్భం ద్వారా పిల్లలను పొందే తల్లులకు 12 వారాల సెలవు.

• నర్సింగ్ విరామాలు.

• 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలలో తప్పనిసరిగా క్రెచ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.

• ప్రసూతి సెలవు తర్వాత, యజమాని, ఉద్యోగి పరస్పర అంగీకారం మేరకు వర్క్-ఫ్రమ్-హోమ్ ఎంపికను కూడా ప్రవేశపెట్టారు.

సులభతర వాణిజ్యం

రికార్డులను డిజిటలైజ్ చేయడం, కంప్లైయెన్స్ భారాలను తగ్గించడం, అనేక నేరాలకు జైలు శిక్ష బదులు ద్రవ్య జరిమానాలను విధించడం ద్వారా సులభతర వాణిజ్యాన్ని ఈ కోడ్ ప్రోత్సహిస్తుంది.

• ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌లో విచారణలు ప్రారంభించడానికి ఐదేళ్ల పరిమితిని ప్రవేశపెట్టింది. వివాదాల త్వరిత పరిష్కారం కోసం నేరాలను సద్దుబాటు చేసుకునే చర్యలు కూడా ఉన్నాయి.

2047 నాటికి వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా, అందరికీ సమ్మిళిత వృద్ధి, సామాజిక భద్రత పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఈ కోడ్ ప్రతిబింబిస్తుంది.

సామాజిక భద్రత కోడ్ 2025: ముఖ్యాంశాలు - Tholi Paluku