Let's talk: editor@tmv.in
సామాజిక తెలంగాణ సాధనే ల‌క్ష్యం: కవిత

సామాజిక తెలంగాణ సాధనే ల‌క్ష్యం: కవిత

Gaddamidi Naveen
10 నవంబర్, 2025

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వరంగల్‌లో జరిగిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.కవిత మాట్టాడుతూ రాజకీయాలు ఎన్నికల సమయంలోనే జరగాలి. సాధారణ రోజుల్లో ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే కృషి చేయాలని ఆమె సూచించారు. ప్రజల సంక్షేమమే నిజమైన రాజకీయమని ఆమె పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తాను ఎదుర్కొన్న పరిమితులను గురించి కవిత వివరించారు.ఆ సమయంలో తాను ప్రోటోకాల్ కారణంగా నిజామాబాద్ ప్రాంతానికే పరిమితమయ్యానని తెలిపారు.అయితే, ఆ పరిమితుల్లో ఉన్నప్పటికీ తన సామర్థ్యానికి తగ్గట్లుగా ప్రజల కోసం అన్ని ప్రయత్నాలు చేశానని ఆమె గుర్తుచేశారు. నాకు ఉన్న బాధ్యతలను ఎప్పుడూ విస్మరించలేదు. సాధ్యమైన ప్రతి చోట ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేపట్టాను అని కవిత అన్నారు.

రాష్ట్రంలో సమాజంలోని ప్రతి వర్గానికీ సమాన అవకాశాలు లభించేలా ‘సామాజిక తెలంగాణ’ సాధించడమే తన ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు. తెలంగాణ సాధన తర్వాత మనకు అవసరమైనది సమానత్వం, న్యాయం, అభివృద్ధి. ప్రతి వర్గం గౌరవంగా జీవించగల తెలంగాణ నిర్మాణం కోసం తెలంగాణ జాగృతి కృషి చేస్తుందని కవిత చెప్పారు.

ప్రజా సమస్యలను అర్థం చేసుకొని వాటికి స్థిరమైన పరిష్కారాలను అందించడం రాజకీయ నాయకుల ప్రధాన ధర్మమని ఆమె పేర్కొన్నారు.నిరుద్యోగులు, మహిళలు, రైతులు, విద్యార్థులు వీరందరికీ న్యాయం జరిగేలా నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు.అలాగే ప్రజలను అభివృద్ధి పథంలో ఏకం కావాలని, రాజకీయ విభేదాలను పక్కనబెట్టి తెలంగాణను సుసంపన్నంగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ విద్యార్థినులకు వసతి గృహం లేకపోవడం దౌర్భాగ్యం

కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌ చదువుతున్న విద్యార్థినుల కోసం సరైన వసతి గృహం ఏర్పాటు చేయలేదని ఆమె ప్రభుత్వాన్ని విమర్శించారు.నేటి కాలంలో ఉన్నత విద్య చదువుతున్న బాలికలకు ప్రాథమిక సౌకర్యాలు కూడా లభించకపోవడం చాలా విచారకరం. విద్యార్థినుల కోసం హాస్టల్‌ లేకపోవడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని ఆమె అన్నారు.

వరంగల్‌ జిల్లాలో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు. అయినప్పటికీ, ఇంత ముఖ్యమైన సమస్యను పట్టించుకోకపోవడం వారికే అవమానకరం. వారు కనీసం ఈ అంశంపై సిగ్గుపడాలని కవిత విమర్శించారు.కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ విద్యా రంగానికి ప్రతిష్ఠాత్మకమైన సంస్థ అని గుర్తుచేస్తూ, విద్యార్థుల సౌకర్యాల విషయంలో ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.తక్షణమే ఇంజనీరింగ్ విద్యార్థినుల కోసం కొత్త వసతి గృహ నిర్మాణానికి నిధులు కేటాయించి, పనులు ప్రారంభించాలని ఆమె కోరారు. “విద్యార్థినుల భద్రత, గౌరవం, సౌకర్యం విషయంలో ఎవరూ రాజీ పడకూడదు అని కవిత పేర్కొన్నారు.

సామాజిక తెలంగాణ సాధనే ల‌క్ష్యం: కవిత - Tholi Paluku