
సానుభూతి వర్సెస్ బీసీ వాదం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలకు పదునుపెట్టాయి. ఇక బీజేపీ ఈ విషయంలో కాస్త వెనకబడ్డట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు గమనిస్తుంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్ఠాత్మకం. అందుకే సీఎం రేవంత్ రెడ్డి బీసీ వాదాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. నవీన్ యాదవ్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడమే అందుకు నిదర్శనం. ఇక బీఆర్ఎస్ మాత్రం సానుభూతి అంశాన్ని నమ్ముకున్నది. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు టికెట్ ఇవ్వడం ద్వారా సింపతి పనిచేస్తుందని ఆ పార్టీ గట్టిగా నమ్ముతోంది. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బస్తీవాసుల ఓట్లు, సెటిలర్ల ఓట్లు కూడా అత్యంత కీలకం. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ సత్తా చాటుతుందో వేచి చూడాలి.
నవంబర్ 11న ఎన్నిక
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో నవంబర్ 11న ఉప ఎన్నిక జరగనున్నది. 3,99 లక్షల మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. దివంగత ఎమ్మెల్యే మగంటి గోపీనాథ్ మీదున్న సానుభూతి పనిచేస్తుందా? లేదంటే కాంగ్రెస్ బీసీ వాదం గెలుస్తుందా? అన్నది కీలకం. సెటిలర్ల ఓట్లు, యువ అభ్యర్థిత్వం, హైడ్రా డిమాలిషన్లు, బస్ చార్జీల పెంపు వంటి అంశాలు ఈ ఎన్నికల ఫలితాలను నిర్ణయించే కీలక అంశాలుగా ఉన్నాయి. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిథ్యం లేదు కాబట్టి ఈ నియోజకవర్గంలో గెలుపొంది సత్తా చాటాలని చూస్తోంది. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది.
బస్తీ వాసుల ఓట్లు కీలకం
జూబ్లీహిల్స్‌లో బస్తీ వాసులు 20-25 శాతం ఓటర్లుగా ఉన్నారు, వీరి ఓట్లు ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. హైడ్రా కూల్చివేతల అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ తెరమీదకు తీసుకొస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే హైడ్రాకు మనం సర్టిఫికెట్ ఇచ్చినట్టేనని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ గెలిస్తే హైడ్రా కూల్చివేతలు విచ్చలవిడిగా జరుగుతాయన్నది వాళ్ల ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బస్తీవాసుల ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పోల్ మేనేజ్ మెంట్ అత్యంత కీలకం. అందుకే బస్తీ వాసుల ఓట్లు నిర్ణయాత్మకశక్తిగా పనిచేస్తాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇక్కడి ఓటర్లను ఆకట్టుకొనేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి.
యువ అభ్యర్థిత్వం
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (35 ఏళ్లు) యువతకు ప్రతీకగా ఉన్నారని కాంగ్రెస్ చెప్పుకుంటున్నది. యువత డెవలప్‌మెంట్, ఉద్యోగాలు కోరుకుంటున్నారు అని టీపీసీసీ నేతలు ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో 18-35 ఏళ్ల వయస్సు గల ఓటర్లు 35 శాతం ఉన్నారు, వీరు సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా ప్రభావితమవుతారు. ట్విట్టర్ (ఎక్స్) లో ఈ విషయంపై కూడా చర్చ జరుగుతోంది.
సానుభూతి పవనాలు వీస్తాయా?
సహజంగా సిట్టింగ్ స్థానాల్లో మరణాంతరం ఉప ఎన్నికలు వస్తే సానుభూతి ఫ్యాక్టర్ పనిచేస్తూ ఉంటుంది. అయితే ఆ ప్రభావం కొన్ని సార్లు బెడిసికొడుతుంది కూడా. గత బీఆర్ఎస్ పాలనలో దుబ్బాక ఉప ఎన్నికలో సానుభూతి అంశం పనిచేయలేదు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీత సానుభూతి ఓట్ల ద్వారా యువతను ఆకర్షిస్తోంది. అయితే ఆమెకు ప్రజలతో సంబంధాలు తక్కువ. బీఆర్ఎస్ నేతలు, అనుచరులే అన్నీ చూసుకుంటూ ఉంటారు. కానీ నవీన్ యాదవ్ నిత్యం ప్రజల మధ్య ఉంటారు. గతంలో పోటీ చేసిన అనుభవం ఉంది. బస్తీ వాసులు, బీసీ వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆయనవైపు కొందరు మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ప్రజలకు కొంత అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే అభివృద్ధి ఆ స్థాయిలో జరగలేదని ఒక వాదన.
సెటిలర్ల మద్దతు
జూబ్లీహిల్స్‌లో సెటిలర్లు (ఆంధ్ర, ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చినవారు) 15-20 శాతం ఓటర్లుగా ఉన్నారు. బీఆర్ఎస్ గతంలో సెటిలర్ ఫ్రెండ్లీ పాలిటిక్స్‌తో వీరి మద్దతు సంపాదించింది. గత ఎన్నికల సమయంలో సెటిలర్ల మద్దతు బీఆర్ఎస్ పార్టీకే లభించింది. మరి ఈ సారి వారు ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారో వేచి చూడాలి. సెటిలర్లలో తెలుగుదేశం అభిమానులు, జనసేన సానుభూతి పరులు కూడా ఉంటారు. వారి మద్దతు కూడా అత్యంత కీలకం
బస్ చార్జీల పెంపు ఎఫెక్ట్ ఉంటుందా?
బీఆర్ఎస్ పార్టీ బస్ చార్జీల పెంపు అంశాన్ని ప్రధానంగా తెరమీదకు తీసుకొచ్చింది. అయితే ఈ అంశం ఎంతమేరకు ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్ చార్జీలను పెంచడం ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తించింది. ఇలా జుబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు అనేకం ఉన్నాయి. వీటిని అధిగమించి, తట్టుకొని ఏ పార్టీ ముందుకు నిలుస్తుందో వేచి చూడాలి.
డబ్బు ప్రభావం
ఉప ఎన్నికలు జరిగినప్పుడు అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నప్పుడు డబ్బు ప్రభావం గణనీయంగా ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం పనిచేసే అవకాశం ఉంది. ముఖ్యంగా బస్తీ వాసులను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న పార్టీ సహజంగా ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డబ్బు, మద్యం ఏరులై పారితే ఆ ప్రభావం కూడా ఎన్నికపై పడుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకొని డబ్బుకు వెనకాడకపోవచ్చు.
