Let's talk: editor@tmv.in
సానా సతీష్ బాబు ఫౌండేషన్ “చిన్నారి నేత్రాలు – సంరక్షణ” కార్యక్రమం

సానా సతీష్ బాబు ఫౌండేషన్ “చిన్నారి నేత్రాలు – సంరక్షణ” కార్యక్రమం

Thaduri Lalitya
26 అక్టోబర్, 2025

ఏలూరు జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు, కళ్ళజోళ్లు అందించే మహత్తర సేవా కార్యక్రమం శనివారం సానా సతీష్ బాబు ఫౌండేషన్, ఏలూరు టీమ్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ప్రారంభం అయ్యే ముందు జాతిపిత గాంధీజీ, మాజీ రాష్ట్రపతి ఏ.పి.జె. అబ్దుల్ కలాం, పొట్టి శ్రీరాములు, ఈదర సుబ్బమ్మ దేవి విగ్రహాలకు పూలమాలలు అర్పించి, మంత్రి, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలనచేశారు. అనంతరం వైద్య శిబిరాన్ని ప్రారంభించి, విద్యార్థుల కంటి పరీక్షలను మంత్రి కొలుసు పార్థసారథి స్వయంగా పర్యవేక్షించారు.

మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, చిన్నారుల్లో దృష్టి దోషాలను చిన్నతనంలో గుర్తిస్తే వెంటనే నివారించవచ్చునని తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఇంటిలో స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరుగుతోందని, చిన్నపిల్లలు ఎక్కువ సమయం ఈ పరికరాల ముందు గడుపుతున్నారని, దీనివల్ల దృష్టి సమస్యలు రావడం సాధ్యమని ఆయన పేర్కొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు కావున తల్లిదండ్రులు వారి ఆరోగ్యాన్ని క్రమంగా పర్యవేక్షించి, చిన్నతనంలో సమస్యలను గుర్తించి, వెంటనే చికిత్స అందించడం ద్వారా వారి భవిష్యత్తు సురక్షితం అవుతుందని తెలిపారు.

కూటమి ప్రభుత్వంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతోందని, 16,347 మందికి పైగా ఉపాధ్యాయులను నియమించి, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చారన్నారు మంత్రి పార్థసారథి. విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచేందుకు మెగా పేరెంట్స్ మీట్స్ నిర్వహించి, వారిలో ఏ సబ్జెక్టులలో వెనుకబడి ఉన్నారో గుర్తించి, తగిన మార్గదర్శకాన్ని అందిస్తున్నట్లు వివరించారు. అలాగే, పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు, గార్డెనింగ్, పరిసరాల పరిశుభ్రత వంటి పాఠ్యేతర కార్యకలాపాలపై ఆసక్తి కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారధ్యంలో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆయన స్ఫూర్తితో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఏలూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించడాన్ని స్ఫూర్తిదాయకంగా పేర్కొన్నారు. ఈ ప్రయత్నం మిగతా జిల్లాలకు కూడా విస్తరించాలన్న నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అన్నారు.

ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య కూటమి ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు అంటే పిల్లల భవిష్యత్తే అని, విద్య, ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకువచ్చిన నారా లోకేష్ నేతృత్వాన్ని గుర్తిస్తూ, ప్రతి యువత ఉన్నత విద్య సాధించి, దేశ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామిగా మారాలి అని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి, పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు, తల్లిదండ్రులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సదస్సు విద్యార్థుల ఆరోగ్య, విద్యా, సమగ్రాభివృద్ధికి దోహదపడినట్లుగా అధికారులు, ముఖ్య అతిథులు అభిప్రాయపడ్డారు.

సానా సతీష్ బాబు ఫౌండేషన్ “చిన్నారి నేత్రాలు – సంరక్షణ” కార్యక్రమం - Tholi Paluku