
సాధారణ ప్రజలకు చేరువ కావడమే లక్ష్యం: సీజేఐ సూర్యకాంత్
సుప్రీంకోర్టు ప్రజల న్యాయస్థానమనే అభిప్రాయం కలిగేలా సాధారణ ప్రజలకు బలమైన సందేశం ఇవ్వాలన్నదే తన లక్ష్యమని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పష్టం చేశారు. సత్వరంగా కేసుల పరిష్కారం, పెండింగ్ వ్యవహారాల ముందస్తు తీర్పు కోసం ఏకీకృత జాతీయ న్యాయ విధానాన్ని అమలు చేయడం తన మొదటి ప్రాధాన్యత అని వివరించారు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ప్రసంగించిన ఆయన, న్యాయం అందరికీ చేరేటట్లు వ్యాజ్య ఖర్చు తగ్గింపు, కాలపరిమితి వంటి ప్రక్రియల్లో మార్పులు అవసరమని చెప్పారు. ఇందుకు నాతో పాటు అందరూ న్యాయమూర్తులు సహకరించాలన్నారు.
రాజ్యాంగమే మార్గదర్శి
రాజ్యాంగబద్ధమైన అధికారాల విభజన తత్వాన్ని ప్రస్తావిస్తూ, రాజ్యాంగం న్యాయవ్యవస్థ, శాసనసభ, కార్యనిర్వాహక వ్యవస్థల పాత్రలను అందంగా నిర్వచించిందని అన్నారు. అవి పరస్పర పూరకంగా పనిచేస్తూ స్వతంత్రతను కాపాడాలని సూచించారు. అన్ని పెండింగ్ కేసులు పూర్తిగా తగ్గిపోవడం అసాధ్యం. న్యాయం పొందేందుకు ప్రజలు కోర్టులను ఆశ్రయించటం ఆరోగ్యకర ప్రజాస్వామిక ప్రక్రియ అన్నారు. పాత కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
సామాన్యుడికి సుప్రీంకోర్టులో స్థానం
సుప్రీంకోర్టు సామాన్యుల కోర్టే. సాధారణ వాదనకు సమయమూ, అవకాశమూ ఉంటాయి. దాని కోసం కేసుల ప్రాధాన్యత క్రమంలో కొన్ని మార్పులు చేస్తాం అని సీజేఐ తెలిపారు. అయనతో పాటు సహ న్యాయమూర్తులందరూ సహకరించాలని తెలిపారు. అలాగే సాంకేతిక మార్పులతో డిజిటల్ అరెస్టు, సైబర్ నేరాల లాంటి కొత్త రకాల నేరాలు పెరుగుతున్నాయని, దీంతో న్యాయ వ్యవస్థకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. అందుకు అనుగుణంగా న్యాయాధికారులు కూడా సాంకేతికతపై పట్టు సాధించాలని అని తెలిపారు. ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాలన్నారు. మానవ వనరుల నిష్పక్షపాత మూల్యాంకనం, మెరుగైన వినియోగం అవసరమన్నారు. న్యాయ వ్యవస్థలో వివిధ ప్రాంతాలు, అట్టడుగు వర్గాలు, మహిళల వంటి వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం ఇవ్వడానికి కృషి జరుగుతోందని సూర్యకాంత్ తెలిపారు. సమ్మిళితత్వం, వైవిధ్యం సుప్రీంకోర్టుకు గొప్ప సంస్కృతిని తీసుకొచ్చాయన్నారు.
అందుబాటులోకి న్యాయం
నిరుపేదలకు ఉచిత న్యాయ సహాయం అందించే సేవలను మరింత విస్తరించినట్లు వివరించారు. నాణ్యమైన న్యాయ సహాయం అందించేందుకు దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. జిల్లా స్థాయిలో కూడా కాలపరిమితి భావన పెంపొందించాలని సూచించారు. భారత ప్రజలు రాజ్యాంగం, చట్టం, ప్రజాస్వామ్యంపై నిబద్ధత కలిగి ఉండటం వల్ల న్యాయవ్యవస్థ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుందని సీజేఐ విశ్వాసం వ్యక్తం చేశారు.
