Let's talk: editor@tmv.in
సాతాన్‌కుళం కస్టోడియల్‌ డెత్‌ కేసులో.. తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష

సాతాన్‌కుళం కస్టోడియల్‌ డెత్‌ కేసులో.. తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష

Pinjari Chand
7 ఏప్రిల్, 2026

తమిళనాడులో సంచలనం రేపిన సాతాన్‌కుళం కస్టోడియల్‌ డెత్‌ కేస్‌ 2020, కేసులో మధురై కోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులైన తొమ్మిది మంది పోలీసు సిబ్బందికి ఉరిశిక్ష విధించింది. 2020లో సాతాన్‌కుళంలో తండ్రి–కొడుకు అయిన పి.జయరాజ్‌, బెన్సిక్స్‌లను పోలీసులు కస్టడీలో దారుణంగా హింసించడంతో వారు మరణించారు. కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ మొబైల్‌ దుకాణాన్ని తెరిచి ఉంచారనే ఆరోపణలతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును విచారించిన మధురై ఫస్ట్ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జి. ముత్తుకుమారన్‌ ఈ ఘటనను ‘అత్యంత అరుదైన క్రూర నేరం’గా పేర్కొన్నారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే ఇలాంటి దారుణానికి పాల్పడటం సమాజాన్ని కుదిపేసిందని వ్యాఖ్యానించారు. నిందితులుగా ఉన్న మాజీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌, మాజీ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు బాలకృష్ణన్‌, రఘు గణేష్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు మురుగన్‌, సామిదురై తదితరులపై హత్య ఆరోపణలు రుజువయ్యాయని కోర్టు పేర్కొంది. అందుకే వారందరికీ ఉరిశిక్ష విధించింది.

రూ.1.40 కోట్ల జరిమానా చెల్లించండి

అదే సమయంలో బాధితుల కుటుంబానికి పరిహారంగా నిందితులు కలిపి రూ.1.40 కోట్ల జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. న్యాయమూర్తి మాట్లాడుతూ, సామాన్య ప్రజలను రక్షించాల్సిన పోలీసులు ఇలాంటి క్రూరత్వానికి పాల్పడితే చట్టం కఠినంగా వ్యవహరించాల్సిందేనని అన్నారు. తండ్రి–కొడుకులను ఒకేసారి హత్య చేయడం ద్వారా ఒక కుటుంబాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని వ్యాఖ్యానించారు. ఈ ఘటన 2020 జూన్‌లో జరిగింది. అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీస్‌ కస్టడీలో తీవ్రంగా కొట్టడంతో ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహానికి దారితీసింది. తర్వాత మద్రాస్‌ హైకోర్టు మధురై బెంచ్‌ ఈ కేసును సుమోటోగా స్వీకరించగా, దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. ఐదేళ్ల పాటు సాగిన విచారణలో మొత్తం 105 మంది సాక్షులను విచారించారు. ప్రారంభంలో కేసులో 10 మంది నిందితులు ఉండగా, వారిలో స్పెషల్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పాల్‌దురై విచారణ సమయంలో ఆరోగ్య సమస్యలతో మరణించాడు.