
సాగునీరు విడుదల చేయండి: సాకే శైలజానాథ్
హెచ్‌ఎల్‌సీ కాలువల దిగువ ఆయకట్టు ప్రాంతాలకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని కోరుతూ శింగనమల నియోజకవర్గ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్‌ఎల్‌సీ దిగువ ఆయకట్టుతోపాటు తాడిపత్రి బ్రాంచ్ కెనాల్, ఎం.పి.ఆర్ డ్యామ్, సుబ్బరాయసాగర్ పరిధిలోని రైతులకు నీరు అందించాలని కోరుతూ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ రైతులు, పార్టీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఎండిపోయిన పంటలను చేతబట్టి తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా శైలజనాథ్ మాట్లాడుతూ హెచ్‌ఎల్‌సీ నీరు ఎం.పి.ఆర్ డ్యామ్ దక్షిణ కాలువ ద్వారా ప్రతి ఏటా ఆయకట్టు ప్రాంత రైతులకు అందుతున్నదని తెలిపారు. అయితే ఈసారి హెచ్‌ఎల్‌సీ దిగువ ప్రాంతంలోని శింగనమల నియోజకవర్గానికి నీరు అందించేందుకు అవకాశం లేదని ఐఏబీ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోందని, దీనిపై రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని అన్నారు.
హెచ్‌ఎల్‌సీ..రైతుల జీవనాధరం
హెచ్‌ఎల్‌సీ నీరు ఒక ప్రాంతానికి సంబంధించిన అంశం కాదని.. వేలాది మంది రైతుల జీవనాధారమని శైలజనాథ్ పేర్కొన్నారు. ఇది రాజకీయ అంశం కాదని, రైతు బతుకు సమస్య అని స్పష్టం చేశారు. ఐఏబీ సమావేశంలో కనేకల్లు చెరువు, హెచ్‌ఎల్‌ఎంసీ, జీబీసీ ఆయకట్టుకు మాత్రమే నీరు అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోందని.. ఎం.పి.ఆర్, పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఆయకట్టు ప్రాంతాలతోపాటు సంబంధిత చెరువులకు నీరు ఇవ్వకపోవడం సరికాదన్నారు.
హెచ్‌ఎల్‌సీ దిగువన ఎం.పి.ఆర్ డ్యామ్ పరిధిలోని శింగనమల, తాడిపత్రి తదితర ప్రాంతాల రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వారికి నీరు ఎందుకు అందించకూడదో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
బోర్లు ఎండిపోతున్నాయి
సెప్టెంబరు వచ్చినా తగిన వర్షాలు లేక పరిస్థితి తీవ్రంగా మారిందని శైలజనాథ్ తెలిపారు. బోర్లు ఎండిపోతుండటంతో మెట్ట భూముల్లో పంటలు సాగు చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికే సాగులో ఉన్న పండ్ల తోటలకు భూగర్భ జలాలు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో రైతులు కన్నబిడ్డల్లా పెంచుకున్న పండ్ల తోటలను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఒక్కో ట్యాంకర్‌కు సుమారు రూ.900 వరకు ఖర్చు అవుతోందని.. పంట చేతికొచ్చే వరకు నిరంతరం ఈ భారాన్ని భరించడం రైతులకు ఆర్థికంగా సాధ్యం కాదన్నారు.
భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ప్రజలు, పశువులకు తాగునీటి సమస్య కూడా తీవ్రతరమవుతోందని శైలజనాథ్ అన్నారు.
శ్రీశైలం నుంచి దిగువకు నీటి విడుదల జరుగుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుని హెచ్‌ఎల్‌సీ చివరి ఆయకట్టు రైతులకు న్యాయం చేయాలని కోరారు. కలెక్టర్‌కు 9 డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, నార్పల సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర నాయకులు బొమ్మన శ్రీరామ్‌రెడ్డి, వంశీ గోకుల్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు, ఎల్లారెడ్డి, పరంధామరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, చామలూరు రాజగోపాల్, అంకె ముసలన్న, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మంజునాథ్, పద్మావతి, బోనాల హరికృష్ణ, ఓబిరెడ్డి, కాటమయ్య, ఆంజనేయులు, నాగలింగారెడ్డి, పుల్లారెడ్డి, కొండ్రెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఫణీంద్ర, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
