
సహారా ఉద్యోగుల పెండింగ్ జీతాల పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
సహారా గ్రూప్ కంపెనీల నుంచి తమ పెండింగ్ జీతాలు చెల్లించాలని కోరుతూ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌లను నవంబర్ 17న విచారణకు తీసుకోవడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. అక్టోబర్ 14న సీజేఐ బి.ఆర్. గవాయి నేతృత్వంలోని బెంచ్, సహారా ఇండియా కమర్షియల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్ఐసీసీఎల్) దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందనలు కోరింది. ఈ పిటిషన్‌లో అదానీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు తమ 88 ప్రైమ్ భూములను అమ్మేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ ఇప్పటికే నవంబర్ 17 విచారణ జాబితాలో ఉంది.
శుక్రవారం పలువురు న్యాయవాదులు చాలా నెలలుగా జీతాలు అందుకోని ఉద్యోగుల మధ్యంతర పిటిషన్‌లను కూడా 17వ తేదీన విచారణ చేపట్టాలని సీజేఐను అభ్యర్థించారు. దీనికి సీజేఐ గవాయి “సరే, వాటిని కూడా లిస్ట్ చేస్తాం” అని అన్నారు.
అంతకుముందు న్యాయమూర్తులు సూర్యకాంత్, ఎం.ఎం. సుందరేశ్‌లతో కూడిన బెంచ్, సహారా గ్రూప్ రిఫండ్ కేసుకు సంబంధించిన ఎస్ఐసీసీఎల్ మధ్యంతర దరఖాస్తును విచారించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థనపై ఆర్థిక, సహకార మంత్రిత్వ శాఖలను కేసులో ప్రతివాదులుగా జోడించాలని కోర్టు ఆదేశించింది. నవంబర్ 17 లోపు వారి స్పందనలు సమర్పించాలని చెప్పింది.
అమికస్ క్యూరీ శేఖర్ నాఫాడేకు ఎస్ఐసీసీఎల్ అమ్మకానికి ప్రతిపాదించిన 88 ఆస్తుల వివరాలు సేకరించాలని బెంచ్ సూచించింది. ఆ ఆస్తులు వివాదరహితమైనవా లేదా వివాదాస్పదమైనవా అన్న అంశాలపై కూడా స్టేక్‌హోల్డర్ల స్పందనలు తీసుకుని సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరింది. "ఆ ఆస్తులను విడివిడిగా అమ్మాలా లేక ఒకేసారి అమ్మాలా అనేదానిపై మేము నిర్ణయం తీసుకుంటాము," అని సీజేఐ అన్నారు.
చాలా సంవత్సరాలుగా జీతాలు చెల్లించని కార్మికుల క్లెయిమ్‌లను పరిశీలించాలని కోర్టు సహారా గ్రూప్‌ను ఆదేశించింది. ఉద్యోగుల జీతాల బకాయిల అంశాన్ని అమికస్ క్యూరీ కూడా పరిశీలించాలని చెప్పింది. తదుపరి విచారణ తేదీన దీనిని పరిగణిస్తామని పేర్కొంది. సహారా సంస్థ పిటిషన్‌తో పాటు అన్ని దరఖాస్తులను నవంబర్ 17న విచారణకు తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.
సెబీ-సహారా వివాదం
సహారా కంపెనీలు అనుమతి లేకుండా ప్రజల నుంచి వేల కోట్లను సేకరించాయని సెబీ ఆరోపించింది. ఈ డబ్బును పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ చెల్లింపులు పూర్తిగా జరగకపోవడంతో కేసు ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు సహారా ఆస్తుల అమ్మకం, ఉద్యోగుల పెండింగ్ జీతాల వంటి అంశాలపై కోర్టు విచారణ చేస్తున్నారు.
