
సహజ వ్యవసాయానికి ప్రపంచ కేంద్రంగా భారత్: ప్రధాని మోడీ
దేశ వ్యవసాయ రంగం వేగంగా మారిపోతున్నదని, సహజ వ్యవసాయం భారత భవిష్యత్తుని నిర్ణయించే ప్రధాన దిశగా మారుతోందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. కోయంబత్తూరులో బుధవారం ప్రారంభమైన దక్షిణ భారత సహజ వ్యవసాయ సదస్సు–2025లో పాల్గొని ఆయన రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ముందుగా ప్రధాని మోడీ పీఎం –కిసాన్ సమ్మాన్ నిధి 21వ విడత కింద రూ.18 వేల కోట్లను దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన సదస్సులో ఏర్పాటు చేసిన సహజ వ్యవసాయ ప్రదర్శనను పరిశీలించారు.
తమిళనాడులోని రైతుల ధైర్యం, మార్పును స్వీకరించే శక్తి నన్ను ఎంతో ఆకర్షించింది. మెకానికల్ ఇంజనీరింగ్ చేయడం, పీహెచ్‌డీ చేయడం, నాసాలో పనిచేసి వదిలి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తున్న యువకులను చూడటం ఎంతో ఆనందం కలిగించింది. ఈ కార్యక్రమానికి రాకపోయి ఉంటే నా జీవితంలో ఒక ముఖ్యమైన అనుభవాన్ని కోల్పోయేవాణ్ని అని ప్రధాని పేర్కొన్నారు. 11 ఏళ్లలో వ్యవసాయ రంగం భారీ మార్పు చవిచూసిందని, వ్యవసాయ ఎగుమతులు దాదాపు రెట్టింపు అయ్యాయని తెలిపారు. రైతుల కోసం ఆధునిక వ్యవసాయ విధానాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. భారత్ సహజ వ్యవసాయానికి ప్రపంచ కేంద్రంగా మారే దిశలో అడుగులు వేస్తోంది. యువత వ్యవసాయాన్ని ఆధునిక, మంచి అవకాశంగా చూస్తున్నారు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతమిస్తుందని మోడీ అన్నారు.
సదస్సు వివరాలు
తమిళనాడు నేచురల్ ఫార్మింగ్ స్టేక్‌హోల్డర్స్ ఫోరం ఆధ్వర్యంలో నవంబర్ 19 నుంచి 21 వరకు జరుగుతున్న ఈ సదస్సులో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 50 వేల మంది రైతులు, శాస్త్రవేత్తలు, సహజ వ్యవసాయ నిపుణులు పాల్గొంటున్నారు. సదస్సులో రసాయన రహిత వ్యవసాయం, మార్కెట్ లింకేజీలు, స్థానిక సాంకేతికతలు, సహజ ఇన్‌పుట్స్, ప్రాసెసింగ్ పద్ధతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
