Let's talk: editor@tmv.in
సహజంగా వర్షం కురిసినా బీజేపీ క్రెడిట్ తీసుకోవాలనుకుంటోంది:ఆప్

సహజంగా వర్షం కురిసినా బీజేపీ క్రెడిట్ తీసుకోవాలనుకుంటోంది:ఆప్

Pinjari Chand
30 అక్టోబర్, 2025

ఢిల్లీలో వాతావరణంపై రాజకీయాలు దుమారం రేపుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికార ప్రతినిధి ప్రియాంకా కక్కర్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీ కేవలం హెడ్లైన్ మేనేజ్‌మెంట్‌కే పనిచేస్తుంది. నిన్న ప్రభుత్వం కరోల్ బాగ్, మయూర్ విహార్, బురారీ ప్రాంతాల్లో కృత్రిమ వర్షం పడిందని అబద్ధం చెప్పారు. కానీ అక్కడికి పోయి మేం చూశాం. ఒక్క చినుకూ పడలేదు. ఇప్పుడు నిజమైన వర్షం పడితే కూడా మేమే వర్షాన్ని కురింపించామని బీజేపీ క్రెడిట్ తీసుకోవాలనుకుంటోంది. క్లౌడ్ సీడింగ్‌(మేఘమథనం)లో కూడా పెద్ద మోసం జరిగిందని ఆమె ఆరోపించారు. ఈరోజు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. దీన్ని కూడా బీజేపీ మేమే చేశామని చెప్పాలని చూస్తోంది. మా ప్రభుత్వంలో కాలుష్యాన్ని తగ్గించడానికి 12 నెలలు పనిచేశాం.మేం శీతకాలం, వేసవికాలంలో చేపట్టాల్సిన పనులను గురించి ముందుగానే చర్యలు తీసుకోనేవాళ్లం. బీజేపీ ఇంతవరకు భవిష్యత్ లో చేయాల్సిన పనుల గురించి ఏమైనా నిర్ణయాలు తీసుకుందా? వారి పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీనే కృతిమంగా వర్షాన్ని కురిపించలేమన్నారు. వీరు నకిలీ పనులు చేస్తున్నారు. వీరంతా క్లౌడ్ సీడింగ్ పేరుతో డబ్బులు తమ జేబుల్లో వేసుకుందామని ప్రయత్నాలు చేస్తున్నారు.

విమర్శించడమే వారి పని:పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా

వాతావరణ శాఖ ప్రకారం వాతావరణంలో 10 నుంచి 15 శాతం తేమ ఉంది. నిన్న మా ట్రయల్ ఆ పరిస్థితుల్లోనే నిర్వహించాం. ఇప్పుడు తేమ ఆ స్థాయిని దాటినప్పుడు తదుపరి ట్రయల్ చేస్తాం. ఐఎండీ చెబుతున్న దాని ప్రకారం సాయంత్రం 4:00 గంటల తర్వాత తేమ మరింత పెరుగుతుందని భావిస్తున్నాం. తదుపరి నివేదికలు వచ్చిన తర్వాత ట్రయల్ ప్రారంభిస్తామన్నారు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ( ఆప్ ) ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పదేళ్లు విఫలమైన ప్రభుత్వం మనల్ని ఎప్పుడూ ప్రశంసించదు. వారు నీటిని శుభ్రం చేయలేకపోయారు. గాలిని శుభ్రం చేయలేకపోయారు. క్లౌడ్ సీడింగ్ కోసం సరైన పరిస్థితులను కూడా నిర్ధారించలేకపోయారు. మేం చేసే ప్రతి పనినీ అడ్డుకోవడానికే వారు ప్రయత్నిస్తారని విమర్శించారు.

ఐఐటీ కాన్పూర్ నివేదిక ప్రకారం

క్లౌడ్ సీడింగ్ సమయంలో తేమ తక్కువగా ఉన్నప్పటికీ పీఎం2.5, పీఎం 10 కణాల సాంద్రతలో 6-10శాతం తగ్గుదల నమోదైందని తెలిపారు. దీని ద్వారా వాయు నాణ్యతలో కొంత మెరుగుదల కనిపించినట్లు వివరించారు. ఢిల్లీ ప్రభుత్వం గాలి నాణ్యతను మెరుగుపరచడానికి వరుసగా రెండు సార్లు క్లౌడ్ సీడింగ్ కార్యకలాపాలను పూర్తి చేసింది. దీనికోసం ప్రభుత్వం సుమారు రూ.3 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించింది.

క్లౌడ్ సీడింగ్ అనేది ఒక అధునాతన వాతావరణ మార్పు శాస్త్రం.ఇది విమానం లేదా ఇతర మార్గాలను ఉపయోగించి సిల్వర్ అయోడైడ్ లేదా సోడియం క్లోరైడ్ వంటి రసాయనాలను వాతావరణంలోనిక ప్రవేశపెట్టి, తద్వారా మేఘాల నుంచి వర్షాన్ని కురిపించడం.

“క్లౌడ్ సీడింగ్ ద్వారా కచ్చితంగా వర్షం కురుస్తుందని చెప్పలేం. ఇది ప్రకృతి మీద ఆధారపడింది. కాబట్టి ఫలితం ఎప్పుడూ అనుకున్న విధంగా ఉండదు.

క్లౌడ్ సీడింగ్ వల్ల వర్షం కురుస్తుందా?

క్లౌడ్ సీడింగ్ వల్ల వర్షపాతం పెరుగుదల సాధారణంగా 10శాతం నుంచి 30శాతం వరకు ప్రభావం చూపే అవకాశం ఉంది. సరైన పరిస్థితులు (తేమ, మేఘాల సాంద్రత, గాలి ఉష్ణోగ్రత) ఉంటే వర్షం కురిసే అవకాశం సుమారు 25శాతం వరకు ఉంటుంది అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కానీ తేమ తక్కువగా ఉండి, మేఘాలు బలహీనంగా ఉంటే అసలు వర్షం కురవకపోవచ్చు.

ఇజ్రాయెల్, యుఎస్, యూఏఈ, చైనా లాంటి దేశాలు దశాబ్దాలుగా ఈ ప్రక్రియను ఉపయోగిస్తున్నాయి. విజయవంతమైన సందర్భాల్లో వర్షపాతం 15–25శాతం పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. అదే సమయంలో విఫలం అయిన ట్రయల్స్ కూడా చాలానే ఉన్నాయి.

సహజంగా వర్షం కురిసినా బీజేపీ క్రెడిట్ తీసుకోవాలనుకుంటోంది:ఆప్ - Tholi Paluku