Let's talk: editor@tmv.in
సోషల్ మీడియా కార్యకర్తలపై గంజాయి కేసులా?

సోషల్ మీడియా కార్యకర్తలపై గంజాయి కేసులా?

Pinjari Chand
25 సెప్టెంబర్, 2025

ప్రభుత్వ తప్పుడు విధానాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన ప్రతిసారీ అక్రమ కేసులు, తప్పుడు అరెస్ట్‌లతో కూటమి ప్రభుత్వం డైవర్షన్‌కు పాల్పడుతోందని వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మూడు రోజుల్లో ముగ్గురు సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లు కనిపించకుండా పోయారని, హెబియస్ కార్ఫస్ పిటీషన్ వేస్తే ఒకరిని తాము అరెస్ట్ చేసినట్లు పోలీసులు హైకోర్ట్ ఎదుట హాజరుపరిచారని తెలిపారు. మిగిలిన ఇద్దరిని కూడా మఫ్టీలో వచ్చిన పోలీసులే తమతో తీసుకువెళ్ళారని, వారి కుటుంబసభ్యులకు ఎటువంటి సమాచారం చెప్పకుండా వేధిస్తున్నారని అన్నారు. అరెస్ట్ చేసిన వారిపై కుట్రపూరితంగా గంజాయి కేసులు పెట్టి, జైళ్ళ నుంచి బయటకు రానివ్వకుండా చేయాలనే కుట్రతోనే పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు చట్టాలను అపహాస్యం చేస్తూ, ప్రశ్నించే గొంతులను నులిమేసేందుకు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...

కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారే కారణంతో సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమంగా కక్షసాధింపుతో తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వ అసమర్థత పై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైన ప్రతి సందర్భం లోనూ డైవర్షన్ పాలిటిక్స్‌కు ఈ ప్రభుత్వం పాల్పడుతోంది. లిక్కర్ స్కాం అంటూ హడావుడి చేయడం, సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లను అరెస్ట్ చేసి హంగామా సృష్టించడం చేస్తోంది. తాజాగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆగ్రహంతో ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో దానిని డైవర్ట్ చేయడానికి మరోసారి పోలీసులను ప్రయోగించి సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లపై అన్యాయంగా కేసులు పెట్టడం తిరిగి ప్రారంభించారు. గతంలో జరిగిన ఘటనలను చూపుతూ తప్పుడు కేసులు పెడుతున్నారు. దీనిలో భాగంగానే సోషల్ మీడియా యాక్టివీస్ట్ సవీంద్రా రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు.

-

సోషల్ మీడియా కార్యకర్తలపై గంజాయి కేసులా? - Tholi Paluku