
స్వదేశీ వస్తువులనే వాడాలి
అమెరికా భారీగా పన్నులు పెంచి మన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తుందని, నష్టాల నుంచి తప్పించుకోవాలంటే దేశంలోని ప్రజలు స్వదేశీ వస్తువులను ఉపయోగించుకుని స్వదేశీ వ్యాపారులకు దన్నుగా నిలవాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం భారత్ గ్లోబల్ ఇండస్ట్రీస్ ఫోరం రీజినల్ వైస్ ప్రెసిడెంట్ బొల్లంపల్లి ఇంద్రసేనా రెడ్డి ఆధ్వర్యంలో హోటల్ పార్క్ హయాత్ లో సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జీఎస్టీ వల్ల కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన రాబడి సుమారు రూ.7 లక్షల కోట్లు తగ్గుతుందని అయినా ప్రజల ప్రయోజనాలే పరమావధిగా తగ్గించిందన్నారు. అలాగే స్వదేశీ వస్తువుల పెంపే లక్ష్యంగా జీఎస్టీ తగ్గింపులు చేశామని వివరించారు. అయితే ప్రజల కొనుగోలు శక్తి పెరిగి త్వరలోనే జీఎస్టీ వసూళ్లు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతులు చేసుకుంటుండటం వల్ల విదేశీ మారక ద్రవ్యం భారీగా కోల్పోవాల్సి వస్తుందని వాపోయారు. అందుకే మన దేశ వస్తువులను వాడి దేశ ఆర్ధిక వ్యవస్థకు బాసటగా నిలవాలన్నారు. అలాగే కార్యక్రమ నిర్వాహకులు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ, పర్యాటక, ఉత్పత్తి రంగాల్లో స్వదేశీ వస్తువులను ప్రోత్సాహించాలని, అందుకు అవకాశాలు కల్పించాలని పారిశ్రామిక వేత్తలు చొరవ తీసుకోవాలన్నారు. ఈ సదస్సులో వచ్చిన సూచనలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు.
