
స్వచ్ఛభారత్: దేశంలో మార్పు వచ్చిందా లేక ప్రచార ఆర్భాటమేనా?
స్వచ్ఛభారత్...11 ఏళ్ల క్రితం తొలిసారి ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. శుభ్రతకు స్వతంత్రపోరాటంలో మహాత్మాగాంధీ ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని 2014లో ప్రధానమంత్రి మోదీ గాంధీ జయంతి అయిన అక్టోబరు 2న స్వచ్ఛభారత్ మొదలుపెట్టారు. ఒక అడుగు శుభ్రతవైపు నినాదంతో మొదలైన స్వచ్చభారత్ 11 ఏళ్ల కాలంలో పరిశుభ్రత విషయంలో భారత్ రూపురేఖలను మార్చిందని చెప్పవచ్చు.
పల్లెలు, పట్టణాలు, నగరాల్లో వీధులను శుభ్రంగా ఉంచడం, బహిరంగ మలమూత్రవిసర్జనలేకుండా చేయడం, ప్రతి ఇంటికీ మరుగుదొడ్ల నిర్మాణం, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వ టాయిలెట్‌లు నిర్మించడం వంటి లక్ష్యాలతో మొదలైన స్వచ్ఛభారత్ అనుకున్నవాటన్నింటినీ సాధించలేకపోయినప్పటికీ చాలా వరకు పల్లెలు, పట్టణాలు, నగరాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడడానికి కారణమైంది. పారిశుధ్యంపై ప్రజల్లో బాగా అవగాహన పెరిగింది. చాలా రాష్ట్రాలు బహిరంగ మల విసర్జన లేని రాష్ట్రాలుగా మారాయి.
2014 నుంచి 2020 వరకు స్వచ్ఛభారత్ తొలిదశ కాగా, 2021 నుంచి 2025వరకు రెండోదశగా భావిస్తారు. తొలిదశలో గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం శరవేగంగా జరిగింది. ఐదేళ్ల కాలంలో పదికోట్ల మరుగుదొడ్లు నిర్మించారు. ప్రతీగ్రామంలో శుభ్రతాకార్యక్రమాలు నిర్వహించారు. కేంద్రప్రభుత్వంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలున్న రాష్ట్రాలు, బీజేపీయేతర రాష్ట్రాల్లో కూడా స్వచ్ఛభారత్‌తో పెను మార్పులే చోటుచేసుకున్నాయి.
స్వచ్ఛభారత్ రెండో దశలో రీ సైక్లింగ్, మురుగునీటి శుద్ధి వ్యవస్థలు, చెత్త నిర్వహణ వంటివాటిపై దృష్టిపెట్టారు. స్వచ్ఛభారత్ 2.0గా పిలిచే రెండో దశ 2021 అక్టోబరులో మొదలయింది. రెండో దశలో ఘనవ్యర్థాలను వేరుచేసి వాటిని శుద్ధిచేసి, సమర్థవంతంగా వినియోగించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ఏటా సెప్టెంబరు 17నుంచి అక్టోబరు 2వరకు స్వచ్ఛతాహిసేవా కార్యక్రమం నిర్వహిస్తారు. శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ అనే కార్యక్రమం ఉంది. దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో శుభ్రతను పరిశీలించి ఉత్తమ నగరాలను ఎంపికచేస్తారు.
2024-25 సంవత్సరంలో ఇందోర్, సూరత్, నవీ ముంబై నగరాలు మొదటి, రెండు, మూడు స్థానాల్లో ఉండగా, విజయవాడ, చండీగఢ్, నోయిడా, మైసూర్ వంటి నగరాలు తర్వతిస్థానాల్లో నిలిచాయి.
ఈ ఏడాది స్వచ్ఛభారత్ అభియాన్‌లో భాగంగా స్వచ్ఛతా హి సేవా కింద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్వచ్ఛత, పచ్చదనం నిర్వహణతో పాటు వ్యర్థాలు లేని ప్రాంతాలను సృష్టించాలన్నది లక్ష్యం.
స్వచ్ఛభారత్ అమలుతో పదకొండేళ్లకాలంలో ప్రజల ఆరోగ్యంలో గణనీయమైన మార్పువచ్చిందని కేంద్రం చెబుతోంది. మరుగుదొడ్ల నిర్మాణం, వ్యర్థాల నిర్వహణ వల్ల డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు తగ్గాయని, శిశుమరణాలు తగ్గాయని, నీటిసరఫరా వ్యవస్థలను మెరుగుపరచడంతో ప్రజల ఆరోగ్యంలో మంచి మార్పు కనిపించిందని కేంద్రం అంటోంది. స్వచ్ఛభారత్ కార్యక్రమం పరిశుభ్రతకు సంబంధించింది మాత్రమే కాదని, పదేళ్ల కాలంలో స్వచ్ఛతకు సంబంధించి 10వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని ప్రధాని మోదీ గత ఏడాది చెప్పారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, నమామి గంగ ప్రాజెక్టు, వ్యర్థాలతో బయో గ్యాస్ తయారీ వంటివి స్వచ్ఛభారత్ మిషన్‌ను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాయని తెలిపారు. స్వచ్ఛభారత్‌తో దేశంలో శిశుమరణాలు తగ్గాయని ఇటీవల ఓ కార్యక్రమంలో మోదీ చెప్పారు.
అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, 11ఏళ్ల కాలంలో చెప్పుకోదగ్గ ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ కావాల్సిన స్థాయిలో దేశంలో శుభ్రత ఏర్పడలేదన్నది ఓ అభిప్రాయం. చెత్త నిర్వహణ విషయంలోనూ అనేక లోపాలున్నాయి. డంపింగ్ యార్డుల్లో చెత్త పేరుకుపోతోంది. ప్రతిరోజూ విధిగా చెత్త సేకరించడం, తడి, పొడి చెత్తను వేరుచేయడం, వ్యర్థాల రీ సైక్లింగ్ విషయంలో అనుకున్న లక్ష్యాలకు ఆమడదూరంలో ఉన్నామనే చెప్పాలి. దేశంలో వ్యర్థాల నిర్వహణ పరిశుభ్రతకు సవాలుగా మారింది. అలాగే వీధుల శుభ్రత గతంతో పోలిస్తే మెరుగ్గా ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రజల అవసరాలకు, ఆరోగ్యానికి తగ్గట్టుగా స్వచ్ఛభారత్ అమలు కావడం లేదన్న ఆరోపణలున్నాయి.
రోడ్ల మీద ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడంతోపాటు బహిరంగ మల,మూత్ర విసర్జన లేకుండా ఉండడంపై ప్రజల్లో అవగాహన ఇంకా పెరగడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు రూపొందించినప్పటికీ ప్రజలు వాటిని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో పరిశుభ్రత విషయంలో ఎలాంటి మార్పూ రావడం లేదు.
స్వచ్ఛభారత్‌తో పదీపదిహేను రోజుల పాటు హడావిడి జరగడం తప్ప వాస్తవంగా ప్రజలకు కావాల్సిన పరిశుభ్రమైన పరిస్థితులు ఏర్పడడం లేదన్న వాదన ఉంది. బస్ స్టాప్‌లు, రోడ్డులు, రైల్వేస్టేషన్లు వంటివాటి చోట్ల చాలాసార్లు పరిశుభ్రత మచ్చుకు కూడా కానరాని పరిస్థితులున్నాయి. అలాగే స్వచ్ఛభారత్ కోసం కేంద్రం కేటాయిస్తున్న నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి.
ఈ ఆరోపణల సంగతి పక్కనపెడితే ప్రజల్లో చాలా మార్పు రావాల్సిన అవసరముంది. ప్రభుత్వాలు కార్యక్రమాలను రూపొందించగలవు, నిధులు కేటాయించగలవుగానీ, ఇలాంటివి విజయవంతం కావాలంటే ప్రజల్లో మార్పు రావాలి. తమ ఇంటినే కాకుండా వీధిని, ఊరును, పట్టణాన్ని,నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే చైతన్యం పెరగాలి. పారిశుధ్య కార్మికులు అప్పుడే రోడ్డు ఊడ్చివెళ్లినా అటుగా పోయే జనం ఆ ప్రాంతాన్ని ఎక్కువసేపు శుభ్రంగా ఉండనివ్వరు. రోడ్డు శుభ్రంగా కనిపించిన కాసేపట్లోనే అక్కడ చెత్తను పేర్చేస్తారు. బహిరంగంగా ఉమ్మి వేయడం, మల,మూత్ర విసర్జన, వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడం, మురికినీళ్లు ఇంటి నుంచి డ్రైనేజీలోకి సరైన విధంగా చేరే ఏర్పాటుచేసుకోకపోవడం..ఇలా చెప్పుకుంటూపోతే ప్రజల బాధ్యతారాహిత్యానికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తుంటాయి.
నిజానికి మనం నివసించే ఇంటితోపాటు మనకు అవసరమైన రోడ్లు, బస్టాప్‌లు, రైల్వేస్టేషన్‌లు, ఇతర బహిరంగ ప్రదేశాలు ఎంత శుభ్రంగా ఉంటే ప్రజల ఆరోగ్యానికి అంతమంచిది. కానీ మనదికాదన్న భావనో, మనమొక్కరమే ఇలా చేయడం లేదు కదా అన్న ఆలోచనో తెలియదుగానీ పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రతి పదిమందిలో తొమ్మిదిమందికి అంతులేని నిర్లక్ష్యం ఉంటుంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా అనేక దేశాలు పరిశుభ్రతకు మారుపేరుగా ఉండడానికి కారణం అక్కడి ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు అమలుచేయడం ఒక్కటే కాదు...ప్రజలు బాధ్యతగా ఉండడం. తమ వీధిని, పట్టణాన్ని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న ఆలోచన అక్కడి పౌరుల్లో కలగడం. మన ఆలోచనల్లో కూడా అలాంటి మార్పువస్తేనే స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాల ఉద్దేశం వందశాతం నెరవేరుతుంది.
