
స్వచ్ఛత హీ సేవలో పాల్గొనండి
దేశంలోని ప్రజలు చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి ముందుకు రావాలని కేంద్ర రసాయనాలు, పరిశ్రమల శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు గురువారం ‘స్వచ్ఛతా హీ సేవ’ లో పాల్గొన్నారు. ఢిల్లీలో కొనసాగుతున్న సేవా పఖ్యాడా డ్రైవ్ లో పౌరులు పాల్గొని క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టాలని కోరారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని ఈ సందర్భంగా సూచించారు. అలాగే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నగరంలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలో పారిశుధ్య కార్మికులను సత్కరించారు. కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఉన్నారు.
చారిత్రక ప్రాంతం చాందిని చౌక్
దేశ రాజధాని వారసత్వ ప్రాంతంగా చౌందిని చౌక్ కు చాలా ప్రాముఖ్యత ఉందని, అలాగే వ్యాపారాలకు కూడా ఈ ప్రాంతం ప్రసిద్ధి గాంచిందని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అన్నారు. ఆమె ఈ సందర్భంగా అక్కడ స్వచ్ఛత హీ సేవా–2025 ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతం ఢిల్లీ సంప్రదాయాలను, సంస్కృతిని తెలుపుతుంది. అలాగే ఇక్కడ సందర్శించడానికి లాక్షలాది మంది వస్తుంటారు. సాధారణంగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా పండుగల సమయాల్లో కూడా ఇక్కడ పరిశుభ్రత నెలకొనేలా చర్యలు తీసుకోవాలని ఇక్కడి అధికారులకు సూచిస్తామన్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా స్వచ్ఛందంగా స్వచ్ఛత సేవల్లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ చాందిని చౌక్ చారిత్రకతను కాపాడటానికి, అన్ని సంస్థల మధ్య సమన్వయం నెలకొల్పడానికి షాజహానాబాద్ పునరాభివృద్ధి పేరును ఇంద్రప్రస్థ పునరాభివృద్ధి అథారిటీగా మార్చాలని డిమాండ్ చేశారు.
