Let's talk: editor@tmv.in
స్విగ్గీ, జొమాటో బంద్ జయప్రదం చేయండి: సీఐటీయూ

స్విగ్గీ, జొమాటో బంద్ జయప్రదం చేయండి: సీఐటీయూ

FL - YUGDR
19 సెప్టెంబర్, 2025

స్విగ్గీ, జొమాటో రైడర్స్ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబరు 20న నిర్వహించనున్న బంద్ జయప్రదం చేయాలని సీఐటీయూ పిలుపునిచ్చింది. సీఐటీయూ నేతలు గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నాయకులు జగన్ మాట్లాడుతూ రైడర్ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె జరుగుతుందని చెప్పారు. విశాఖపట్నం జిల్లాలో గత 7 సంవత్సరాలుగా స్విగ్గీ, జొమాటోలో పనిచేస్తున్న సుమారు 40,000 మంది కార్మికులు రోజూ సమాజానికి సేవలందిస్తున్నా, వారికి ఎటువంటి ఉద్యోగ భద్రత, స్థిరమైన ఆదాయం, సామాజిక భద్రత లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యను పూర్తి చేసినప్పటికీ ఉపాధి అవకాశాల లేకపోవటంతో ఈ పని వైపు మొగ్గు చూపాల్సి వచ్చిందని చెప్పారు. వీరికి ఏమైనా సమస్య వస్తే పరిష్కరించే నాథుడే లేరన్నారు.

ప్రధాన డిమాండ్లు ఇవే..

రైడర్లు రోజురోజుకూ పెరిగిపోతున్న జీవన ఖర్చులు, పెట్రోల్ ధరలు, అనిశ్చితమైన ఆదాయం కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు పేర్కొన్నారు. అక్రమంగా తొలగించిన రైడర్స్ ఐడీలను వెంటనే పునరుద్ధరించాలని, కనీస వేతనం, ఆదాయం అమలు చేయాలని కోరారు. పీక్ టైం కంపల్సరీ విధానం తగ్గించాలని, ఒక రకమైన ఇన్సెంటివ్ విధానం ఉండాలని, ఫేక్ నోటిఫికేషన్లను తొలగించాలని డిమాండ్ చేశారు. క్యాన్సిలేషన్ ఫీజు చెల్లించాలని, బేస్ ఫెయిర్ కనీసం 30 రూపాయలకు పెంచాలని, కిలోమీటరుకు సాధారణ సమయంలో 10 రూపాయలు, పీక్ టైంలో 12 రూపాయలు తక్కువ లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 7 సంవత్సరాల క్రితం పెట్రోల్ 76 రూపాయలు ఉండేటప్పుడే ఆదాయం బాగా వచ్చేదని, ఇప్పుడు పెట్రోల్ లీటరు 108 రూపాయలకు పెరిగిందని, లాగిన్ హవర్స్ పెరిగాయని, ఆర్డర్స్ పెరిగాయని తెలిపారు. నిత్యావసర ధరలు పెరిగాయి కానీ వచ్చే ఆదాయం రోజు రోజుకు తగ్గిపోతుందన్నారు. రైడర్కి ఏమైనా సమస్య వస్తే ఇక్కడ మాట్లాడడానికి పరిష్కారం చేయడానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి, సమస్య పరిష్కారం చేయడానికి కంపెనీ భాధ్యులు ఉండాలని సూచించారు .ఇప్పుడున్న టీఎల్, మేనేజర్ గానీ సమస్యలు పరిష్కారం చేయలేదని, కనీసం ఫోన్లో స్పందించడం లేదని చెప్పారు.

స్విగ్గీ, జొమాటో బంద్ జయప్రదం చేయండి: సీఐటీయూ - Tholi Paluku