Let's talk: editor@tmv.in
‘సర్‌’ ప్రక్రియ ద్వారా పౌరసత్వ హక్కులను హరించాలని బీజేపీ కుట్ర: ఎంపీ అసదుద్దీన్

‘సర్‌’ ప్రక్రియ ద్వారా పౌరసత్వ హక్కులను హరించాలని బీజేపీ కుట్ర: ఎంపీ అసదుద్దీన్

Gaddamidi Naveen
16 ఫిబ్రవరి, 2026

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స‌ర్) ప్రక్రియ ద్వారా ప్రజల పౌరసత్వ హక్కులను లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. శనివారం రాత్రి ఎంఐఎం పార్టీ 68వ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓటరు జాబితాల ప్రత్యేక సవరణను మొదట బీహార్‌‌లో చేపట్టిన తర్వాత అదే విధానం తెలంగాణ, మహారాష్ట్రలో కూడా అమలు చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియ జరిగే సమయంలో నిజమైన ఓటర్ల పేర్లు తప్పకుండా జాబితాల్లో ఉండేలా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల సవరణను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహిస్తూ పౌర హక్కులను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా, రాష్ట్ర ఎన్నికల అధికారులు ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియను ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా, తెలంగాణలో ఇటీవల జరిగిన మేడారం జాతరలో ఒక ముస్లిం వ్యాపారిపై కొందరు యూట్యూబర్లు చేసిన దాడిని ఓవైసీ తీవ్రంగా ఖండించారు. ఆ వ్యాపారి కోవా బన్ అమ్ముతుంటే, అందులో మీకు ‘ఫుడ్ జిహాద్’ కనిపిస్తుందా? ఆహారం నచ్చకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయాలి కానీ, ఇలా మతపరంగా టార్గెట్ చేయడం దేశ ద్రోహమే అవుతుంది. ఈ వేధింపులకు పాల్పడిన యూట్యూబర్లపై తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే శక్తుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాలని ఓవైసీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.