
సర్ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే నామినేటెడ్ పదవులు కట్: సీఎం రేవంత్ హెచ్చరిక
తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్-సర్) ప్రక్రియను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే నాయకులకు భవిష్యత్‌లో కార్పొరేషన్ చైర్మన్ పదవులు లేదా ఇతర నామినేటెడ్ పోస్టులు ఇవ్వబోమని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
ఆదివారం ఎస్‌ఐఆర్‌పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, ఎస్‌ఐఆర్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్ దరఖాస్తుల సమర్పణకు గడువును ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో, ఆ తేదీ వరకు పార్టీ నాయకులు గాంధీభవన్‌కు రావద్దని సీఎం సూచించారు. ఈ అదనపు సమయాన్ని ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలు తెలుసుకోవడానికి, ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడానికి వినియోగించాలని చెప్పారు. జిల్లాల్లో కొంతమంది పార్టీ నాయకులు చురుకుగా పనిచేయకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో నిర్లక్ష్యం ప్రదర్శించే నాయకులను భవిష్యత్‌లో కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పదవుల నియామకాల సమయంలో పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. అలాగే తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించని ఎంపీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జూలై 20న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎస్‌ఐఆర్ పురోగతిపై పది మంది ఇన్‌చార్జి మంత్రులు సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటున్న ఎంపీలు కూడా సమయం దొరికినప్పుడల్లా తమ బాధ్యతల పరిధిలోని నియోజకవర్గాల్లో ఎస్‌ఐఆర్ పురోగతిని సమీక్షించాలని సూచించారు. సమీక్ష సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గైర్హాజరు కాకూడదని హెచ్చరించారు.
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 489 సమావేశాలు నిర్వహించినట్లు సమావేశంలో వెల్లడించారు. ముఖ్యంగా వెనుకబడిన నియోజకవర్గాల్లో వెంటనే మరింత దృష్టి సారించి చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
బూత్ లెవల్ అధికారుల (బీఎల్ఓలు) నివేదికలపైనే పూర్తిగా ఆధారపడకుండా, కాంగ్రెస్ తరఫున పనిచేస్తున్న బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) సమర్పించే నివేదికలను కూడా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, చైర్మన్లు క్షుణ్నంగా పరిశీలించాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ తరఫున పనిచేస్తున్న బీఎల్‌ఏలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, పార్టీ నాయకులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఉండాలని చెప్పారు.
రాబోయే పది రోజుల పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎస్‌ఐఆర్ బాధ్యతలు నిర్వహిస్తున్న పార్టీ ప్రతినిధులు తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని సీఎం ఆదేశించారు. గాంధీభవన్ బృందం బీఎల్‌ఏలు, బీఎల్‌వోలు సమర్పించే నివేదికలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో అత్యుత్తమంగా పనిచేసిన వంద మంది బూత్ లెవల్ ఏజెంట్లకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసే అవకాశం కల్పించి, ఆయనతో ఫొటోలు దిగే అవకాశం కూడా కల్పిస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్‌ఐఆర్ పురోగతిపై జూలై 30న సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.
