Let's talk: editor@tmv.in
‘సర్’ పై చర్చకు ఓకే: కేంద్ర ప్రభుత్వం

‘సర్’ పై చర్చకు ఓకే: కేంద్ర ప్రభుత్వం

Pinjari Chand
3 డిసెంబర్, 2025

జాతీయ గీతం ‘వందేమాతరం’ రచనకు 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా లోక్‌సభలో సోమవారం (డిసెంబర్ 8) ప్రత్యేక చర్చ జరగనుంది. మరుసటి రోజు మంగళవారం (డిసెంబర్ 9) ఎన్నికల సంస్కరణలపై చర్చ నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అన్ని పార్టీల సమావేశంలోనూ, వ్యాపార సలహా కమిటీ (బిఏసి) సమావేశంలోనూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి రిజిజు వెల్లడించారు. ప్రతిపక్షాలు పట్టుబట్టిన ‘ఎన్నికల జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్)’ అంశంపై ఇరు సభల్లోనూ చర్చ జరపాలన్న డిమాండ్ పెరిగింది. అలాగే సభలకు పదే పదే అడ్డంకులు కలిగిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష పార్టీల నేతల సమావేశం చాలా ఫలవంతంగా సాగింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవంపై పూర్తి రోజంతా చర్చ జరుగుతుంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎన్నికల సంస్కరణలపై చర్చ ఉంటుందని రిజిజు మీడియాతో అన్నారు.

ఎన్నికల సంస్కరణల చర్చలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని అంశాలనూ చర్చించుకోవచ్చని, ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ చాలా కీలకమని ఆయన గుర్తుచేశారు. ప్రతిపక్ష పార్టీలు ఈ నిర్ణయానికి పూర్తిగా సహకరించాలని ఆయన ప్రత్యేకంగా కోరారు. లోక్‌సభలో చర్చలు పూర్తయిన తర్వాత ఈ అంశాలను రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

ప్రధాని మోడీ ‘వందేమాతరం’ చర్చకు శ్రీకారం చుట్టనున్నారు.

కాంగ్రెస్ చీఫ్ విప్ కె. సురేష్ మీడియాతో మాట్లాడుతూ సోమవారం ‘వందేమాతరం’పై, మంగళ-బుధవారాల్లో ఎన్నికల సంస్కరణలపై చర్చ జరుగుతుంది. ప్రతి చర్చకు 10 గంటల చొప్పున సమయం కేటాయించాం. అవసరమైతే ఎక్కువ సమయం పెంచుకోవచ్చు అని తెలిపారు. ‘వందేమాతరం’ చర్చను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు.

ఇండియా కూటమి గెలిచింది - మాణికం ఠాగూర్ కాంగ్రెస్ ఎంపి

మాణికం ఠాగూర్ ఈ నిర్ణయాన్ని ఇండియా కూటమి విజయంగా అభివర్ణించారు. ‘అహంకారం చివరికి 240 + 100 ఎంపీల ఐక్యత ముందు తలవంచింది. డిసెంబర్ 9న ఎన్నికల సంస్కరణలపై చర్చ ఖరారైంది అని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. మునుపటి వర్షాకాల సమావేశాలు పూర్తిగా కొట్టుకుపోయాయని, ఈ శీతాకాల సమావేశంలోనూ రెండు రోజులు వృథా అయ్యాయని ఆయన గుర్తుచేశారు. ఎస్ఐఆర్ అంశంపై ప్రతిపక్షాలు వరుసగా రెండో రోజూ లోక్‌సభను అడ్డుకోవడంతో సభను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఓం బిర్లా అన్ని పార్టీల నేతలతో సమావేశమై స్తంభనను తొలగించే ప్రయత్నం చేశారు. ఎస్ఐఆర్‌ను ఎన్నికల సంస్కరణల చర్చలో భాగంగా చేర్చుకుని రాజీ సాధించినట్లు తెలుస్తోంది.

ఎస్‌ఐఆర్ అంశంపై నిరసనలతో రోజంతా సభ వాయిదా

పార్లమెంటు శీతాకాల సమావేశాల రెండో రోజు మంగళవారం మధ్యాహ్నం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) పై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో గందరగోళం నేపథ్యంలో లోక్‌సభను రోజంతా వాయిదా వేశారు. స్పీకర్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంపీ దిలీప్ సైకియా ప్రతిపక్ష సభ్యులను క్రమశిక్షణ పాటించి, సభ కార్యకలాపాలు సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. దేశం పార్లమెంటు సజావుగా నడవాలని కోరుకుంటోంది. దయచేసి ప్రజల మాటైనా వినండి. మీరు (ప్రతిపక్ష ఎంపీలు) కూర్చోండి. మీ వల్లే సభ నడవడం లేదు, దేశం చూస్తోంది. ప్రతిరోజూ ఇలా జరగడం చాలా తప్పు. మీరు సభ మధ్యలోకి వచ్చి నిలబడుతున్నారు. సభ నడవడానికి మీరు ఇష్టపడటం లేదని సైకియా అన్నారు.

ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రూల్ 377 కింద విషయాలు చర్చించే ప్రయత్నం చేసినా, ప్రతిపక్ష సభ్యుల నిరంతర నినాదాలు, నిరసనల వల్ల కార్యకలాపాలు కొనసాగలేదు.

చైర్మన్ సార్ మా మాట కూడా వినండి. మా డిమాండ్లు కూడా పరిగణనలోకి తీసుకోండి అంటూ ప్రతిపక్ష సభ్యులు సభ మధ్యలోకి వచ్చి ‘ఓట్ చోర్, గద్ది ఛోడ్’ అంటూ నినాదాలు చేశారు. ఉదయం 11 గంటలకు కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత లోక్‌సభలో మూడు సార్లు వాయిదా పడింది. మొదటి వాయిదా కొన్ని నిమిషాల్లోనే పడగా, మధ్యాహ్నం 12 గంటలకు మళ్లీ సమావేశమైంది. నిరసనలు కొనసాగడంతో మళ్లీ వాయిదా పడింది. కొద్ది సమయం నడిచినప్పుడు మంత్రులు, ఎంపీలు వివిధ కమిటీల నివేదికలు సమర్పించారు. ప్రశ్నోత్తర సమయంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సభ వాయిదా పడకముందు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజూ ప్రతిపక్షాలను తప్పుపట్టారు. సభ కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు.

మొదటి రోజు నుంచి చెప్పాం, ప్రశాంతంగా చర్చించుకుందాం. నిన్న నిరసనలపై నిరసన తెలిపాం. ఇవాళ మళ్లీ ఈ నినాదాలపై నిరసన తెలియజేస్తున్నా. దేశంలో అనేక అంశాలున్నాయి, ఏ అంశాన్నీ చిన్నదిగా భావించం. కానీ సభ నియమాల ప్రకారమే నడుస్తుంది, ఇతర అంశాలను కూడా పక్కన పెట్టలేం అని రిజిజు అన్నారు. ప్రతిపక్ష నినాదాల మధ్యనే ఆయన మాట్లాడారు.శీతాకాల సమావేశాలు నిరంతర అంతరాయాల మధ్య కొనసాగుతున్నాయి. సభ సాఫీగా నడిచేలా సహకరించాలని ప్రభుత్వం ఎంపీలను కోరుతోంది. రాజ్యసభలోనూ ఎస్ఐఆర్ అంశంపై ప్రతిపక్షాలు పదే పదే నినాదాలు చేయడంతో వాయిదా పడింది.

మణిపూర్ జీఎస్టీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

నైరుతి రాష్ట్రం మణిపూర్‌లో జీఎస్టీ 2.0 సంస్కరణలను అమలు చేయడానికి రూపొందించిన బిల్లును రాజ్యసభ మంగళవారం ఆమోదించింది. ఈ బిల్లు సంబంధిత ఆర్డినెన్స్‌కు బదులుగా వచ్చిందని, ఇది మణిపూర్ ప్రజలకు, వ్యాపార రంగానికి ఉపయోగపడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. బిల్లు సోమవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. బిల్లుపై చర్చకు ప్రతిస్పందిస్తూ, ప్రతిపక్ష పార్టీలు మణిపూర్ సమస్యపై మొసలి కన్నీళ్లు కారుస్తూ ప్రజల ఆవేదనలపై “డ్రామా” చేస్తున్నాయని సీతారామన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మణిపూర్ గురించి ప్రతిసారి పెద్ద పెద్ద విమర్శలు చేస్తారు. కానీ బడ్జెట్ బిల్లుపై చర్చకు కూడా రారు. జీఎస్టీ వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని పెంచే ఈ బిల్లుపై కూడా చర్చకు రాకుండా గైర్హాజరు కావడం బాధ్యతలేనిదని అన్నారు. అధునాతన ట్రాక్ అండ్ ట్రేస్ విధానంతో పారదర్శకత పెరిగి, వ్యాపారాలకు అనిశ్చితి తొలగిపోతుందని ఆమె తెలిపింది. అదే విధంగా 28శాతం పన్ను శ్రేణిని రద్దు చేశామని, అనేక సరుకులను 18శాతం స్లాబ్‌కు తరలించామని గుర్తుచేశారు బిల్లుపై చర్చలో పలువురు సభ్యులు మణిపూర్‌లో నెలకొన్న అస్థిరతను ప్రస్తావించారు.

మణిపూర్ లో ఎన్నికలు నిర్వహించండి

బీజేడీ సభ్యురాలు సులతా దేవో మాట్లాడుతూ మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన సడలించి, ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. 28శాతం జీఎస్టీతో భారత్ ప్రపంచంలోనే అత్యధిక రేటును అమలు చేస్తున్న దేశంగా ఉందన్నారు. వైసీపీ సభ్యుడు అయ్యోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ ఈ బిల్లు మణిపూర్ ఆర్థిక పునరుద్ధరణకు తోడ్పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. హింసాత్మక ఘటనలు గత దశాబ్దంలో గణనీయంగా తగ్గినట్లు పేర్కోన్నారు. 2008లో 740 ఘటనలు, 2020లో 97, 2023లో హింస మళ్లీ పెరిగిందన్నారు. కొండ—లోయ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలకు పరిష్కారం అవసరం అన్నారు. గత రెండేళ్లలో మణిపూర్‌లో మేతేయి—కుకి- సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు ఉద్ధృతం కావడంతో 260 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిర్వాసితులయ్యారు. పారదర్శకమైన జీఎస్టీ వ్యవస్థ పెట్టుబడులు, ఆదాయాల పెరుగుదలకు తోడ్పడుతుందని నామినేటెడ్ సభ్యుడు హర్షవర్ధన్ శ్రింగ్లా వ్యాఖ్యానించారు. రాజ్యసభ ఆమోదం తరువాత ప్రతిపత్తి కోసం మళ్లీ లోక్‌సభకు పంపారు. చట్టంగా మారేందుకు తుది ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.

‘సర్’ పై చర్చకు ఓకే: కేంద్ర ప్రభుత్వం - Tholi Paluku