Let's talk: editor@tmv.in
‘సర్’ గడువు పొడిగించిన ఈసీ

‘సర్’ గడువు పొడిగించిన ఈసీ

Pinjari Chand
12 డిసెంబర్, 2025

దేశంలో రెండో విడతలో తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరుగుతున్న ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ పై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తడం, అలాగే బీఎల్వోలపై అధిక పని ఒత్తిడి వల్ల కొంతమంది మరణించడం, అలాగే ఆత్మహత్యకు పాల్పడుతుండడంతో పలువురు పిటిషన్ లు వేయగా సుప్రీం కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుంది. గడువును పెంచాలని, అలాగే సిబ్బంది సంఖ్యను కూడా పెంచాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సూచించింది. దీంతో తాజాగా ఈసీ కొంతమేర గడువును పెంచుతూ ఆరు రాష్ట్రాల అధికారులకు సూచించింది.

కొత్త షెడ్యూల్ ప్రకారం

ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల అభ్యర్థన మేరకు ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) గడువును ఎన్నికల సంఘం గురువారం పొడిగించింది. తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అండమాన్-నికోబార్ దీవులు, ఉత్తరప్రదేశ్‌లో ఎస్ఐఆర్ కొత్త షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఆరు ప్రాంతాల్లో గణన గడువు ఈరోజు (డిసెంబర్ 11)తో ముగియాల్సి ఉండగా, డ్రాఫ్ట్ ఓటరు జాబితా డిసెంబర్ 16న ప్రచురించాల్సి ఉంది.

కొత్త షెడ్యూల్ ప్రకారం:తమిళనాడు, గుజరాత్‌లో గణన గడువు డిసెంబర్ 14 వరకు పొడిగించారు. డ్రాఫ్ట్ జాబితా డిసెంబర్ 19న విడుదల చేయాలని తెలిపింది.

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అండమాన్-నికోబార్ దీవుల్లో గణన గడువు డిసెంబర్ 18 వరకు. డ్రాఫ్ట్ జాబితా డిసెంబర్ 23న.

ఉత్తరప్రదేశ్‌లో గణన గడువు డిసెంబర్ 26 వరకు పొడిగించారు. డ్రాఫ్ట్ జాబితా డిసెంబర్ 31న విడుదల.

గోవా, పుదుచ్చేరి, లక్షద్వీప్, రాజస్థాన్, పశ్చిమ బంగాల్‌లో గణన గడువు ఈ రోజుతో ముగియనుంది. డ్రాఫ్ట్ జాబితా డిసెంబర్ 16న ప్రచురిస్తారు. కేరళలో ఇంతకుముందే షెడ్యూల్ ను సవరించారు. అక్కడ గణన డిసెంబర్ 18తో ముగిస్తుంది, డ్రాఫ్ట్ జాబితా డిసెంబర్ 23న వెలువడుతుంది. ఒక్క అర్హుడైన ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా చూడటం కోసం కొత్తగా ఓటరు అర్హత పొందినవారు ఫారం-6 నింపి బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్వోల)కు ఇవ్వాలని లేదా ECINet యాప్/వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలని ఎన్నికల సంఘం కోరింది. తుది ఓటరు జాబితా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రచురించనుంది.