Let's talk: editor@tmv.in
సర్వేంద్రియానాం నయనం ప్రధానం

సర్వేంద్రియానాం నయనం ప్రధానం

Dantu Vijaya Lakshmi Prasanna
19 అక్టోబర్, 2025

కళ్లు కలలనే కాదు ,కథలనుకూడా మోస్తాయి. బరువైన హృదయం దాచుకున్న మాటలన్నీ కళ్లు అందంగా చూపిస్తాయి. ఓ సారి చెప్పలేనంత సంతోషాన్ని,మరోసారి భరించలేని బాధని , మనకు తెలియకుండానే అందరితో మాట్లాడేస్తాయి. నచ్చిన వాటిని కళ్లలో దాచేస్తాయి. అప్పుడప్పుడు ఊహా లోకంలో విహరిస్తాయి. చిలిపి తలపులు గుర్తొస్తే పసిపిల్లల బోసినవ్వులా అమాయకంగా నవ్వేస్తాయి.బరువైన మాటలకు తెలియకుండా మేఘాలై వర్షిస్తాయి.మరి అలాంటి కళ్లు మనకి ఎంత ముఖ్యమో కదా..ఇలా కళ్లు అవి కనే కలల గురించి ఎంత మంది కవులు కవితలు రాసారో కదా…మరి ఆ నయనాలు కలువరేకులంత సుకుమారంగా వుంటాయి. అలాంటి కళ్ళను ఎంత జాగ్రత్త గా కాపాడుకోవాలి. అసలెందుకు ఇప్పుడు ఈ కళ్ల గురించి అంటారా.. ఎందుకో మీరే తెలుసుకోండి……

గత ఏడాది 12 ఏళ్ల రవి అనే అబ్బాయి దీపావళి పండుగ కోసం ఎంతో ఆనందంగా ఎదురుచూసాడు. దీపావళి రాగానే అతను తన సోదరుడు సునీల్‌తో కలిసి కొత్త రకమైన ఫ్లికర్ పటాసులు తెచ్చాడు. పటాకులను వెలిగించాలనుకున్నాడు. అప్పటికే గాలి బలంగా వీస్తున్నది. వాళ్ళ పెద్దవాళ్లు పూజా కార్యక్రమం లో నిమగ్నమై వుండగా,ఆతృత ఆనందంలో ఉన్న రవి, పెద్దవారి పర్యవేక్షణ లేకుండా పటాకులను నేరుగా భూమికి ఉంచి వెలిగించాడు, ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పటాసులు పేలిన శబ్దం.. పటాసులు పేలగానే చిన్న నిప్పు రవ్వలు పటాసులకు దగ్గరగా వుండడంచేత రవికి కళ్లలోకి ప్రవేశించాయి. రవి వెంటనే కేకలు వేశాడు. అతని సోదరుడు భయంతో పెద్దవారిని పిలిచాడు. అప్పటికే రవి కళ్లు ఎర్రగా మారిపోయాయి. వెంటనే రవిని దగ్గరలో ఉన్న కంటి వైద్యుని దగ్గరకు తీసుకెళ్లారు. వైద్యుడు సమయానికే చికిత్స చేయడం వల్ల రవి కళ్లకు ఎప్పటికీ శాశ్వత గాయం కాకుండా సురక్షితంగా కాపాడారు.

అన్నిసార్లూ ఇలానే జరగదు. కొన్నిసార్లు పెద్ద పెద్ద గాయాలు కూడా ఊహించలేనంత ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. పిల్లలే కాదు పెద్దవాళ్లు ఒక్కోసారి ఇలా అనుకోని ప్రమాదాలకు గురవుతున్నారు

కథలో నేర్చుకోవలసిన పాఠం:

పటాసులు ఎప్పుడూ పెద్దవారి పర్యవేక్షణలోనే వెలిగించాలి. కళ్లను రక్షణతో కప్పుకోవాలి.గాలి దిశ, భద్రత, పటాసులు వెలిగించాక దూరంగా ఉండడం, పటాసుల రకం వంటి అంశాలను గమనించాలి.ప్రమాదం జరిగితే వెంటనే వైద్య సహాయం పొందాలి.

దీపావళి సరదాల కేళి,ఆదమరిచి వుండొద్ధు

దీపావళి చిన్నాపెద్దా తేడా లేకుండా ఉత్సాహంగా జరుపుకొనే పండగ.దీపావళికి టపాకాయల వ్యాపారం ఏటా రూ. కోట్లలో జరుగుతుంది. పెద్ద శబ్దం, ఎక్కువ పొగ, ఆకర్షణీయ ఆకారాలతో ఉండే టపాసులు కాల్చడానికి పిల్లలు, పెద్ధలు ఇష్టపడుతున్నారు. కాల్చేటప్పుడు అలసత్వం ప్రదర్శిస్తే అది విషాదానికి దారి తీసే ప్రమాదం ఉంది. అందుకే.. ఆనంద, సురక్షిత దీపావళికి తగు జాగ్రత్తలు తీసుకొందాం.

బాణసంచా కాల్చేటప్పుడు కాటన్‌ దుస్తులు ధరించండి. కాళ్లకు పాదరక్షలు తప్పనిసరి. కళ్లద్దాలు పెట్టుకోవాలి. బహిరంగ ప్రదేశంలో కాల్చాలి. విద్యుత్తు తీగలు, గడ్డివాములు, గుడిసెలు, పెట్రోల్‌ బంకులు ఉన్న చోట కాల్చరాదు. పిల్లలు బాణసంచా కాల్చేటప్పుడు పెద్దలు దగ్గర ఉండాలి. కాల్చి గాల్లోకి ఎగరవేయడం లాంటి చేష్టలు ప్రమాదకరం. టపాసులు వెలిగించేటప్పుడు కొవ్వొత్తి లేదా అగర్‌బత్తి ఉపయోగించాలి. బాణసంచాను గ్యాస్‌ స్టౌ, పొయ్యిల చెంత ఉంచొద్దు. కాకరవత్తులు, విష్ణుచక్రాలు కాలిన తర్వాత వాటి ఇనుప తీగలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తే మనకే కాదు పశువులకు అపాయం పొంచి ఉంటుంది. వాకిట్లో బకెట్‌ నిండా నీళ్లు, దగ్గర ప్రథమ చికిత్స కిట్‌ ఉంచుకోవాలి. శిశువులు, గర్భిణులు, వృద్ధులుండే చోట పెద్ద శబ్దం చేసే బాణసంచా కాల్చకుండా జాగ్రత్తలు తీసుకొందాం.

పండగంటే ఇంటిల్లిపాదికీ ఆనందమే. మిఠాయిలు చేసుకోవడంతో పాటు టపాసులు కాల్చుతూ పిల్లలు, పెద్దలూ ఎంతో సందడి చేస్తుంటారు. అయితే, ఈ పండుగ హడావుడిలో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా అధిక మోతాదులో బాణసంచా పేల్చడం, బయట తిరగడం వల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. దీపావళి కాలుష్యంతో ఆస్తమా రోగులకే కాదు.. మామూలు వారిలోనూ కొన్ని శ్వాససంబంధమైన సమస్యలు తప్పవంటున్నారు. దగ్గు, శ్వాస పీల్చుకోలేకపోవడం, గురక, ఆస్తమా వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో కొన్ని చిట్కాలను పాటిస్తే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని చెబుతున్నారు.

మాస్క్‌ తప్పనిసరి

ప్రతిఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. తద్వారా పొగ ద్వారా వచ్చే ఘాటు వాసనాలను నియంత్రించడంతో పాటు కాలుష్యం బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇంటినుంచి బయటకు వెళ్లినప్పుడు మాస్కును తప్పనిసరిగా పెట్టుకోవాలి. దీనివల్ల గాలిలో ఉన్న చిన్న చిన్న కణాలు మీ ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది.

విటమిన్‌ సి

ఈ పండుగ నాలుగు రోజులు విటమిన్‌ సి ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ రోగ నిరోధక శక్తి మరింత బలోపేతమవుతుంది. రోజూ నిమ్మరసం తీసుకోవడం ద్వారా ‘విటమిన్‌ సి’ సులభంగా పొందొచ్చు. ఇదే కాకుండా ఉసిరి కచ్చితంగా తినేలా చూసుకోండి. చట్నీ, క్యాండీ, ఊరగాయ.. ఇలా ఏ రూపంలోనైనా ఉసిరి తీసుకోవడం ద్వారా ‘విటమిన్‌ సి’ పొందొచ్చు. మీ ఊపిరితిత్తులు సరిగా పనిచేయాలన్నా, రోగనిరోధక శక్తి బాగా ఉండాలన్నా మీరు చురుగ్గా ఉండటం చాలా ముఖ్యం. శ్వాససంబంధ వ్యాయామాలతో ఇది సాధ్యమవుతుంది. అలాగే, బాగా నీరు తాగాలి. ఉదయాన్నే శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయడం ద్వారా అధిక ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మనం పీల్చే గాలిలో కాలుష్య కారకాలు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం తగినంత నీరు తాగడం ఎంతో ముఖ్యం. శరీరంలో తగినంత నీరు లేకపోతే అంతర్గత అవయవాల పనితీరు క్షీణిస్తుంది. అందువల్ల రోజంతా పానీయాలు తీసుకొనేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా చేయడం వల్ల మీ ఊపిరితిత్తులు మరింత బాగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది.అనారోగ్యం బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

బయట తిరగకపోవడమే ఉత్తమం

దీపావళి కాలుష్య ముప్పునుంచి బయటపడాలంటే ఇంటినుంచి బయటకు వెళ్లకపోవడమే ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. బయటి పరిస్థితులతో పోల్చిస్తే కాలుష్య మోతాదు ఇంట్లో కాస్త తక్కువగానే ఉంటుంది. అలాగని, కేవలం ఇంట్లోనే ఉండిపోవడం వల్ల కూడా ఊపిరితిత్తులు సురక్షితమని చెప్పలేం. అందుకే ఇంట్లో ఎయిర్‌ ప్యూరిఫైర్లు వాడితే ఫలితం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

చిన్న,పెద్ధ, జాతి, కులం, మతం,భాష,ప్రాంతం,ఇలా అన్నిటికీ అతీతంగా చేసుకునే దివ్వె ల పండుగ దీపావళి. ఈ పండుగ అందరికీ సరదాలు సంతోషాలు తీసుకురావాలి. పండుగలు మన ఆచారాల,సంస్కృతుల పారంపర్యానికి ప్రతీకలు కాబట్టి వాటిని తగినంత జాగ్రత్తలు పాటిస్తూ ఆనందంగా చేసుకుందాం.