Let's talk: editor@tmv.in
సర్వీస్ రివాల్వర్ మిస్‌ఫైర్…ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దుర్మరణం

సర్వీస్ రివాల్వర్ మిస్‌ఫైర్…ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దుర్మరణం

Panthagani Anusha
26 జనవరి, 2026

విధి నిర్వహణ ముగించుకుని మరి కొద్దిసేపట్లో ఇంటికి వెళ్లాల్సిన ఆ కానిస్టేబుల్‌ను మృత్యువు తుపాకీ గుండు రూపంలో కబళించింది. నంద్యాల జిల్లా ధోన్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన పి. పెద్దయ్య (50) ధోన్ రైల్వే స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి ఎస్కార్ట్ విధులు పూర్తి చేసుకున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో రైలు దిగి స్టేషన్‌కు చేరుకున్నారు.

విధులు ముగియడంతో తన వద్ద ఉన్న సర్వీసు తుపాకీని స్టేషన్‌లోని ఆయుధ డిపాజిట్ కేంద్రంలో అప్పగించే ప్రక్రియలో ఉండగా ప్రమాదవశాత్తూ అది మిస్‌ఫైర్ అయింది. తుపాకీ నుంచి వెలువడిన గుండు నేరుగా పెద్దయ్య ముఖానికి బలంగా తగలడంతో ఆయన తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై రైల్వే పోలీసులు భారతీయ నాగరిక సురక్షా సంహిత (బిఎన్ఎస్ఎస్) సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆయుధాన్ని డిపాజిట్ చేసే సమయంలో భద్రతా నిబంధనలు పాటించారా లేదా? సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతుడు కర్నూలు జిల్లా సి. బెలగల్ గ్రామానికి చెందిన వ్యక్తిగా సమాచారం.