
సర్పంచ్ ఎన్నికల కోసం కూతురిని హత్య చేసిన తండ్రి అరెస్ట్
రాజకీయ కాంక్ష ఒక తండ్రిని కిరాతకుడిగా మార్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అడ్డుగా ఉందన్న కారణంతో, తన ఆరేళ్ల కన్నకూతురిని కాల్వలో పడేసి చంపిన పాండురంగ తండ్రి, నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. ఈ కేసులో నిందితుడైన తండ్రితో పాటు అతనికి సలహా ఇచ్చిన ప్రస్తుత సర్పంచ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే?
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకా కేరూర్ గ్రామానికి చెందిన 28 ఏళ్ల వ్యక్తి ముఖేడ్‌లో సెలూన్ నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మహారాష్ట్రలో రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేయాలని అతను భావించాడు. అయితే, మహారాష్ట్ర ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు.
జనవరి 29న నిందితుడు తన ఆరు ఏళ్ల కూతురిని బైక్‌పై తీసుకుని మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా వైపు వచ్చాడు. తన స్వగ్రామానికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కాలువ వద్ద బాలికను పడేసి హత్య చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. కొద్ది సేపటి తరువాత కాలువలో బాలిక మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బాలిక ఫోటోను పోలీస్ శాఖ విడుదల చేయగా, ముఖేడ్ ప్రాంతానికి చెందిన కొంతమంది ఆమెను గుర్తించారు. అనంతరం పోలీసులు కేరూర్ గ్రామానికి వెళ్లి, మృత బాలిక అక్కడే నివసించే కుటుంబానికి చెందినదేనని నిర్ధారించారు.
దర్యాప్తులో నిందితుడు ముఖేడ్లో సెలూన్ నిర్వహిస్తూ, భార్యతో పాటు ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నట్లు వెల్లడైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలనే ఉద్దేశంతో, ప్రస్తుతం ఉన్న సర్పంచ్ సూచన మేరకు ఒక పిల్లను దత్తత ఇవ్వాలని కూడా ఆలోచించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు, తన కుమారుడి జనన ధ్రువీకరణ పత్రంలో మార్పులు చేయడానికి పుణె కార్పొరేషన్ కార్యాలయం వరకు వెళ్లినా అది సాధ్యం కాలేదు.
ఈ ప్రయత్నాలు విఫలమవడంతో, ఒక పిల్లను హత్య చేసి, ఆ తర్వాత మిస్సింగ్ కేసుగా చూపించాలనే పథకాన్ని నిందితుడు రచించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే కూతురిని తెలంగాణకు తీసుకువచ్చి కాలువలో పడేసి హత్య చేశాడు.
కేసు ఛేదించిన పోలీసులు నిందితుడితో పాటు ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న సర్పంచ్‌ను కూడా అరెస్ట్ చేశారు. దర్యాప్తు అనంతరం కేసు సెక్షన్లను హత్య, అపహరణ తదితర తీవ్రమైన నేరాలకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత సెక్షన్లుగా మార్చినట్లు పోలీసులు తెలిపారు. కేవలం ఒక పదవి కోసం కన్నకూతురిని బలితీసుకున్న ఈ ఘటన రెండు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
