
సర్దార్@150: పశ్చిమ బెంగాల్‌లో ఐక్యతా మార్చ్‌లు
ప శ్చిమ బెంగాల్‌లో బాలూర్‌ఘాట్ ప్రాంతంలో జరిగిన పత్రికా సమావేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని సర్దార్@150 కార్యక్రమం కింద నవంబర్ 17, 19 మధ్య పశ్చిమ బెంగాల్‌లోని 126 ప్రాంతాల్లో ఐక్యతా మార్చ్‌లను నిర్వహిస్తామని కేంద్ర మంత్రి సుకంత మజుందార్ తెలిపారు.
మజుందార్ మాట్లాడుతూ, "సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఐక్యతా మార్చ్‌లు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా, పశ్చిమ బెంగాల్‌లోని సుమారు 126 ప్రాంతాలలో, ప్రతి జిల్లాలోని మూడు ప్రాంతాలలో ఐక్యతా మార్చ్‌లు 17, 18, 19 తేదీలలో జరుగుతాయి" అన్నారు. ఈ కార్యక్రమంలో యువత భాగస్వామ్యాన్ని గురించి చెబుతూ , "చాలా మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మేము ప్రతి ప్రాంతం నుండి ఇద్దరి నుండి ఐదుగురు యువకులను ఎంపిక చేసి, వారిని సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మస్థలం నుండి ప్రారంభమయ్యే మార్చ్ కి తీసుకెళ్తాము” అన్నారు.
యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ కూడా ఈ సందర్భంగా ఈ క్రింది ప్రకటన విడుదలచేసింది. “సర్దార్ @150 ఐక్యతా మార్చ్ అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని గౌరవిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమం. ఇది భారతదేశాన్ని ఏకీకృతం చేయడంలో సర్ధార్ వల్లభాయి పటేల్ పోషించిన అసాధారణ పాత్రకు ప్రతీక. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ (ఒకే భారత్ ఉత్తమ భారత్) లో భాగంగా, ఇది గౌరవనీయ ప్రధాన మంత్రి వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలతో ముందుకు సాగుతుంది.
ఈ మొత్తం కార్యక్రమంలో భాగంగా పాదయాత్రతో పాటు, జిల్లాలవారీగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు, వీటిలో ముఖ్యంగా నీటి వనరుల వద్ద పరిశుభ్రత డ్రైవ్‌లు, "సర్దార్ ఉపవన్" కార్యక్రమం కింద మొక్కలు నాటడం, మహిళా సంక్షేమ శిబిరాలు, యోగా, ఆరోగ్య శిబిరాలు, "వోకల్ ఫర్ లోకల్" ప్రచారాలు ఉంటాయి. ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం, పౌరులను సమీకరించడం, స్థానిక కార్యక్రమాలలో వారిని భాగం చేయడం, యువ శక్తిని దేశ నిర్మాణంలోకి ఆహ్వానించడం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
యూనిటీ మార్చ్ 2025 ఒక సమగ్ర అభివృద్ధి కోసం రూపొందించిన బహుళ దశల నిర్మాణాన్ని అనుసరిస్తుంది, సర్దార్ పటేల్ వారసత్వాన్ని గౌరవించడానికి జిల్లా సమీకరణలు జాతీయ పాదయాత్రలను ఒకచోట చేర్చుతుంది.
జాతీయ స్థాయి పాదయాత్ర నవంబర్ 26, 2025, అంటే రాజ్యాంగ దినోత్సవం నాడు ప్రారంభమై, డిసెంబర్ 6, 2025 న ముగుస్తుంది. ఈ చారిత్రక పాదయాత్ర సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మస్థలమైన కరమ్సద్ నుండి ప్రారంభమై, కేవడియాలోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద ముగిసే వరకు 152 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ పాదయాత్రలో పాల్గొంటారు.
ప్రీ-ఈవెంట్ కార్యకలాపాలలో భాగంగా, మై భారత్ వాలంటీర్లు, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, ఎన్ సి సి క్యాడెట్‌లు, యువ నాయకుల చురుకైన భాగస్వామ్యంతో మార్గంలో ఉన్న ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం కింద సామాజిక అభివృద్ధి కార్యకలాపాలు చేపడతారు.
