
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలకు సన్నాహాలు
దేశ సమైక్యత కోసం పోరాడిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధన అందరిపై బాధ్యత ఉందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఈనెల 31న నిర్వహించబోయే సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలపై మహబూబ్ నగర్ క్యాంపు కార్యాలయంలో ‘యూనిటీ మార్చ్’ పోస్టర్ విడుదల చేశారు.
'ఏక్ భారత్ - ఆత్మనిర్బర్ భారత్' తో ప్రత్యేక కార్యక్రమాలు
మహబూబ్‌నగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఉక్కుమనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యత కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయసాధన మనందరి లక్ష్యమని అన్నారు. పటేల్ 150వ జయంతిని అధికారికంగా దేశవ్యాప్తంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ‘ఏక్ భారత్ – ఆత్మనిర్భర్ భారత్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 150వ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని ఏక్తా ర్యాలీ పేరుతో 8 కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుందని, ఇందులో పార్టీలకతీతంగా ప్రజలను భాగస్వామ్యం కావాలన్నారు. ఈ ఏక్తా ర్యాలీ మహబూబ్‌నగర్‌లోని స్టేడియం గ్రౌండ్ నుంచి ప్రారంభమై తెలంగాణ చౌరస్తా, గడియారం చౌరస్తా, అశోక్ టాకీస్ మీదుగా పిల్లలమర్రి రోడ్ వరకు చేస్తున్నట్లు తెలిపారు.ఈ ఏక్తా మార్చ్ కార్యక్రమాన్ని ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ యాత్రలు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు జరుగుతాయని ఎంపీ వెల్లడించారు. పాలమూరులో నిర్వహించబోయే 'మేరా యువ భారత్ ఎక్తా ర్యాలీ'లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని, పటేల్ 'ఏక్ భారత్' లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎంపీ చెప్పారు.
విద్యాసంస్థల్లో పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు
ఈ సందర్భంగా పార్లమెంట్ పరిధిలో ప్రత్యేక హెల్త్ క్యాంపులు, విద్యాసంస్థల్లో వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన ప్రతిభావంతులకు గుజరాత్‌లో జరుగనున్న జాతీయ ఏక్తా ర్యాలీలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని చెప్పారు.
అలాగే మహబూబ్‌నగర్‌లోని మేరా యువ భారత్ కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, స్ఫూర్తిదాయక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పటేల్ విలువలను సమాజంలో ప్రతిష్టించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతామని, యువకుల్లో పటేల్ స్ఫూర్తిని నింపుతూ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేలా చూస్తామని ఎంపీ పేర్కొన్నారు.
సర్దార్ వల్లభభాయ్ పటేల్ భారత ఐక్యతకు కట్టుదిట్టమైన శిల్పి. తెలంగాణ ప్రాంతం ఉన్న హైదరాబాదు సంస్థానం విలీనంలో ఆయన పాత్ర అత్యంత ప్రాముఖ్యమైనది. 1948లో "పోలీస్ యాక్షన్" ద్వారా హైదరాబాదు సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడంలో పటేల్ తీసుకున్న దృఢనిశ్చయాత్మక నిర్ణయం వల్లే తెలంగాణ ప్రజలు భారత రాజ్యాంగంలో భాగమయ్యారు. ఆయన కృషి లేకపోయి ఉంటే నేటి తెలంగాణ, భారతదేశ అభివృద్ధి గాధ పూర్తిగా వేరుగా ఉండేది.
