
సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం 'ఉక్కు మనిషి' సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. "బలమైన, సామరస్యపూర్వక, అద్భుతమైన భారతదేశాన్ని" నిర్మించడానికి అందరూ సంకల్పం తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.
రాష్ట్రపతి సందేశం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ “సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్ప దేశభక్తుడు, దూరదృష్టి గల నాయకుడు, దేశ నిర్మాణ శిల్పి. ఆయన అచంచల సంకల్పం, అపార ధైర్యం, నేర్పుతో కూడిన నాయకత్వంతో దేశ ఐక్యత సాధించారు” అని పేర్కొన్నారు.
"ఆయన అంకితభావం, జాతీయ సేవ స్ఫూర్తి మనందరికీ ప్రేరణగా నిలుస్తాయి. ఈ జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా మనమంతా ఏకమై బలమైన, సామరస్యపూర్వక, అత్యుత్తమ భారతదేశాన్ని నిర్మించడానికి సంకల్పం తీసుకుందాం" అని రాష్ట్రపతి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
గుజరాత్‌లోని నడియాద్‌లో 1875లో జన్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్, భారత స్వాతంత్య్ర సమరంలో కీలక పాత్ర పోషించారు. ఆయన జయంతిని ప్రతి సంవత్సరం ‘జాతీయ ఐక్యత దినోత్సవం’గా జరుపుకుంటారు.
స్వాతంత్య్రం అనంతరం 560కు పైగా రాజ్యాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను ఈ దినోత్సవం గుర్తుచేస్తుంది. ఆయన చూపిన ఐక్యతా భావం భారత ప్రజల్లో సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుంది. దేశ ఐక్యతకు అచంచల నిబద్ధతతో సేవలందించిన ఆయనను ప్రజలు “భారతదేశపు ఉక్కు మనిషి”గా పిలుస్తారు.
నివాళులు
'ఉక్కు మనిషి' సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని సర్దార్ పటేల్ చౌక్ వద్ద రాష్ట్రపతి ముర్ము ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఆమె రాష్టప్రతి భవన్‌లోని గణతంత్ర మండపంలో పూలమాలలతో సర్దార్ పటేల్‌కు నివాళి అర్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా సర్దార్ పటేల్ చౌక్ వద్ద పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు.
